Trump Towers Hyderabad : హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. వీటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసా? ఒక్కో ప్లాట్ ధర ఎంతంటే? దక్షిణ భారతంలోనే టాప్..
Trump Towers Hyderabad : హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో అడుగు పెట్టింది. భారతదేశంలో ట్రంప్ బ్రాండ్‌కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డైవలపర్స్ హైదరాబాద్‌కు చెందిన ఇరా రియల్టీతో కలిసి ఈ ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును నిర్మాణం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
Trump Towers Hyderabad
Trump Towers Hyderabad : హైదరాబాద్ మహానగరంలో స్కైలైన్‌లో మరో అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. కోకాపేట్లో ట్రంప్ బ్రాండ్‌తో నిర్మించనున్న భారీ టవర్స్ ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారాయి. రెండు ఎత్తైన టవర్లను కలుపుతూ ప్రత్యేకమైన స్కై బ్రిడ్జ్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సుమారు 242 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న ఈ టవర్స్ హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త రూపాన్ని తీసుకురానున్నాయి. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నగరంలోని ప్రీమియం హౌసింగ్ మార్కెట్లో సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది.
హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో అడుగు పెట్టింది. భారతదేశంలో ట్రంప్ బ్రాండ్‌కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డైవలపర్స్ హైదరాబాద్‌కు చెందిన ఇరా రియల్టీతో కలిసి ఈ ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును నిర్మాణం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
కోకాపేట్ గోల్డెన్‌మైల్ రోడ్డులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65 అంతస్తులతో మొత్తం రెండు టవర్లను అభివృద్ధి చేస్తున్నారు. 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న ఈ టవర్స్‌లో మొత్తం 16 పెంట్హౌస్లతోపాటు 450 అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి ధరను మినహాయించి రూ.1,700 కోట్ల నుంచి రూ. 1,800 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రెబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి తెలిపారు. ఈ టవర్స్ భారతదేశంలో ఎనిమిదో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టు. అయితే, దక్షిణ భారతదేశంలో మాత్రం ఇదే మొదటిది కావడం విశేషం. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 2031వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ట్రంప్ బ్రాండ్ భారత మార్కెట్లోకి 2014లో అడుగు పెట్టింది. ముంబై, పుణె, గురుగ్రామ్, నోయిడా, కోల్‌కతా వంటి నగరాల్లో ఇప్పటికే ఈ సంస్థ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి.. నాలుగేళ్లలో ట్రంప్ టవర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు చర్యలు ప్రారంభించారు.
ఈ ట్రంప్ టవర్స్‌లో ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలిస్తే కళ్లుబైర్లుకమ్మాల్సిందే. ఈ టవర్స్‌లో 3.5 BHK, 4 BHK, డబుల్-హైట్ సింప్లెక్స్లు, పెంట్‌హౌస్‌లు ఉండనున్నాయి. అయితే, వీటి ధరలు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కొన్ని పెంట్‌హౌస్ డీల్స్ ఇప్పటికే వందల కోట్ల విలువలో జరిగాయని సంస్థ వెల్లడించింది. మార్కెట్ లిస్టింగ్స్‌లో కూడా ప్రాజెక్ట్ ధరలు యూనిట్, సైజు ఆధారంగా భారీగా మారుతున్నాయి. ఈ ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఇప్పటికే కొన్ని బుకింగ్స్ వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.
వామ్మో.. రూ.62కోట్లా?
కోకాపేటలో నిర్మించనున్న ట్రంప్ టవర్స్ లో మొత్తం 16 పెంట్‌హౌస్‌లు ఉంటాయి. ఇందులో ఎనిమిది పెంట్‌హౌస్‌లను ఇప్పటికే రూ.250 కోట్లకు విక్రయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక పెద్ద పెంట్‌హౌస్ ను రూ.62కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. దీనిని బట్టి చూస్తుంటే.. ట్రంప్ టవర్స్ కు డిమాండ్ భారీగా పెరుగుతోందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి ఇది ఓ ఐకానిక్‌గా నిలస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
