ఖైదీ బొమ్మలు : ప్రాణం తీసిన చేతులే కళాఖండాల ఆవిష్కరణ

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 05:36 AM IST
ఖైదీ బొమ్మలు : ప్రాణం తీసిన చేతులే కళాఖండాల ఆవిష్కరణ

సంగారెడ్డి  : క్షణికావేశం జీవితాలను తల్లక్రిందులు చేసేస్తుంది. కోపంతోనో..ఆవేశంతో చేసిన నేరాలు కుటుంబాలను కష్టాల కడలిలోకి నెట్టేస్తాయి. కానీ ప్రాణం తీసిన చేతులే అందమైన చిత్రాలను గీస్తున్నాయి.  కరడుగట్టిన ఓ నేరస్థుడు గుండెలో అందమైన దృశ్యాలు ఆవిషృతమవుతున్నాయి.  రక్తపు మరకలు అంటిన చేతులే ఇప్పుడు రంగు రంగుల చిత్రాలకు ప్రాణంపోస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జైలు గోడలే దీని సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
 
క్షణికావేశంతో  చేసిన నేరానికి జీవత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. శిక్షపడుతున్న ఆ జైలు గోడలపై తన అద్భుత కళాఖండాలను గీస్తూ అందరిచేత శెభాష్  అనిపించుకుంటున్నాడు. అతడే సంగారెడ్డి పట్టణానికి చెందిన బి.శంకర్. 
 

ఒక ఘర్షణలో ఓ వ్యక్తిని హత్య చేశాడు. చేసిన నేరానికి న్యాయస్థానం అతడికి జీవత ఖైదును విధించింది. 2016లో చర్లపల్లిజైలులో శిక్షను అనుభవిస్తున్న శంకర్..ములాఖాత్‌ (కుంటుం సభ్యులతో మాట్లాడటం)కు ఇబ్బందిగా ఉందని అతడిని 2017లో సంగారెడ్డి జిల్లా జైలుకు మార్చారు. స్వతహాగా పెయింటర్. అంతేకాదు ఈవెంట్లకు స్టేజీలను అందగా డెకరేట్ చేయటం అతనిలోని మరో ప్రత్యేకత. వ్యక్తిగతంలో ఎటువంటివాడైనా చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు కదా.  జైలు శిక్షలో భాగంగా చేసిన నేరానికి గాను శిక్ష అనుభవిస్తున్న శంకర్ మొదట్లో చర్లపల్లిలో కొన్ని చిత్రాలు గీసి జైలు  అధికారులకు చూపించాడు. వారు శంకర్ లోని కళను ఎంతగానో మెచ్చుకున్నారు. 
 

ఈ క్రమంలో తాను గీసిన చిత్రాలను చూసి జైలు అధికారులు మెచ్చుకోవడమే కాకుండా జైలులో పలు కళాఖండాలను పెయింటింగ్ వేసేలా అవకాశం కల్పించారు. దీంతో చర్లపల్లి జైలు గోడలపై ఎక్కడ చూసినా శంకర్ గీసిన కళా ఖండాలే కనిపిస్తుంటాయి. కాగా 2017 డిసెంబర్‌లో సంగారెడ్డి జిల్లా జైలుకు వచ్చిన శంకర్ గతంలో ఇక్కడ రిమాండ్ ఖైదీ ఉనప్పుడు ఒక చిత్రాన్ని గోడపై గీశాడు. ఇప్పటికీ అది అలానే ఉంది. తాజాగా జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ అతడి టాలెంట్‌ను చూసి జైలు గోడలపై బుద్ధుడి జీవత చరిత్ర మొత్తం గీయాలనటంతో  శంకర్ జిల్లా జైలు రూపురేఖలనే మార్చేశాడు.

అతడు గీసినచిత్రాలు చూస్తుంటే అందరూ అభినందించకుండా ఉండలేరు. అంత సజీవంగా చిత్రాలు వేయటం శంకర్ కళలోని ప్రత్యేకత. వీటితో పాటు అతడు కొన్ని చిత్రాలు ప్రత్యేకంగా కూడా గీశాడు. తెలంగాణ తల్లి చిత్రంతో పాటు వీర వనితల చిత్రాలు.. ఇంకా పలు అందమైన చిత్రాలను గీసి అందరి చేత మన్నననులు పొందుతున్నాడు. శంకర్ ప్రతిభను చూసిన జైలు అధికారులు అతడిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.