సంక్రాంతి రద్దీ : ప్రజలను దోచేస్తున్న రైల్వే

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 08:13 AM IST
సంక్రాంతి రద్దీ : ప్రజలను దోచేస్తున్న రైల్వే

హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలనే సెంటిమెంట్ ను అదనుగా తీసుకుని రైల్వే శాఖ ప్రయాణీకులను దోచేస్తోంది. ఒకపక్క ప్రయివేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు చేస్తు ప్యాసింజెర్స్ రక్తం తాగేస్తుంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం అధిక చార్జీలతో రైల్వే కూడా దోచేస్తోంది.సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లాలను ఆరాటపడే ప్రయాణీకుల నుంచి ప్రయివేట్ ట్రావెల్స్ తాము మినహాయింపు కాదంటూ రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న దక్షిణ మధ్య రైల్వే సాధారణ టిక్కెట్ ధరలు కంటే మూడు రెట్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తోంది. 

సువిధ రైళ్లలో ఆర్‌ఏసీ పేరుతో ఉన్న బెర్తుల కంటే ఎక్కువ టికెట్లు విక్రయించడం దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. కామన్ ఛార్జీతో పోలిస్తే ఆర్‌ఏసీ టిక్కెట్లకు ఐదారు రెట్లు అధికంగా వసూలు చేయడమే కాదు..ఒకే బెర్తును ఇద్దరికి ఇస్తున్న  రైల్వే శాఖ దోపిడీకి పరాకాష్ట అని ప్రయాణికులు మండిపడుతున్నారు. 
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, కాకినాడ, నర్సాపురం, విశాఖ నగరాలకు జనవరి 10 నుంచి 13 వెళ్లేందుకు తిరుగు ప్రయాణానికి అనుగుణంగా ‘సువిధ’ సికింద్రాబాద్- కాకినాడ మధ్య రోజుకు రెండు, మూడు సువిధ రైళ్లు నడుపుతోంది. స్లీపర్‌, ఏసీ క్లాస్ టికెట్లతోపాటు ఆర్‌ఏసీ టిక్కెట్లనూ భారీగా పెంచేసింది. 

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు సాధారణ ఛార్జీ రూ.220 కాగా, సువిధ రైళ్లలో డైనమిక్‌ ఫేర్‌లో గరిష్ఠ ధర రూ.1,065గా నిర్ణయించారు. అలాగే సికింద్రాబాద్‌- విశాఖపట్నం స్లీపర్‌ ఛార్జీ రూ.360 కాగా, సువిధలో రూ.1365గా నిర్ణయించారు. పైగా ఆర్‌ఏసీ టిక్కెట్లలో ఒక బెర్తును ఇద్దరికి కేటాయించడానికి పూనుకున్నారు. ఈ విధానం సాధారణంగా రైళ్లలో ముందు నుంచే ఉన్నదే అయినా ఐదారు రెట్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న సువిధ రైళ్లలోనూ దాన్ని అమలుచేయడం ఏంటని నిలదీస్తున్నారు. 

టిక్కెట్ రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులు ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే ఆర్‌ఏసీ వారికి ఆ బెర్తు కేటాయిస్తారు. పండగ సమయంలో మూడు నుంచి నాలుగు రెట్ల అధిక ఛార్జీతో టికెట్‌ కొన్నవారు ప్రయాణం రద్దుచేసుకునే అవకాశాలు ఉండవని రైల్వే అధికారులే అంటున్నారు. అంటే గమ్యస్థానం చేరే వరకు బెర్తులో పడుకునే అవకాశం ఉండదన్నమాట. అధికారులకు ఈ విషయం తెలిసినా రెట్టింపు ధరలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్న ప్రభుత్వం ఇలా పండుగలకు వెళ్లేవారి వద్ద నుంచి ఇలా అధిక చార్జీల పేరుతో దోపిడీ చేయటం ఏమిటని మండిపడుతున్నారు. 
ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రైల్వే శాఖ, సంక్రాంతి, అధిక చార్జీలు,