Home » పాతికేళ్లుగా పరిష్కారానికి నోచుకోని వివాదం : పంచగ్రామాల భూసమస్యకు మూలం ఎక్కడుంది…?
Published
2 weeks agoon
The land problem of the five villages : తరతరాలుగా అక్కడే ఉంటున్నారు. దశాబ్దాలుగా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. భూములకు శిస్తు కడుతున్నా వాటిపై హక్కు మాత్రం వారికి లేదు.. ఇల్లు రిపేరు చేయించుకోవాలన్నా, బోరు వేయించుకోవాలన్నా అడ్డుకునే అధికారులు ఒక వైపు….మంచినీటి కుళాయి కనెక్షన్ తీసుకుందామన్నా, ఇళ్లు కట్టుకుందామన్నా పర్మిషన్ ఇవ్వని అధికారులు మరోవైపు….ఎన్నికలు వచ్చినప్పుడల్లా భూ సమస్య పరిష్కరిస్తామని నాయకులు చెప్పే మాటలు నమ్మి ఓట్లు వేస్తున్న ఆ పేద ప్రజలకు చివరికి నిరాశే ఎదురవుతోంది. సింహాచలం పరిధిలోని పంచగ్రామాల భూసమస్యకు మూలం ఎక్కడుంది…?
పంచగ్రామాలు…ఈ పేరు చెప్పగానే దశాబ్దాల భూ వివాదాలు…వాటిలో చిక్కుకుని విలవిలవాడుతున్న ప్రజల జీవితాలు కళ్లముందు కనిపిస్తాయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం లక్ష్మీనారసింహుడు కొలువైన పుణ్యక్షేత్రం ఒక వైపు. వందల ఎకరాల భూమి, ఐదు గ్రామాలకు చెందిన 12 వేల ప్రజలు మరోవైపు….ఎన్నో కమిటీలు, కోర్టు కేసులతో దశబ్దాలు గడచిపోయాయి. ప్రభుత్వాలు మారినా సింహాచలం పంచగ్రామాల భూసమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
సింహాచలం అప్పన్నకు విశాఖ, విజయనగరం జిల్లాల్లోని 32 గ్రామాల్లో భూములు ఉన్నాయి. ఇరవై ఏడు గ్రామాల్లో ఎలాంటి సమస్య లేకపోయినా.. ఐదు గ్రామాల్లో మాత్రం దశాబ్దాల తరబడి వివాదం రగులుతోంది. అడవివరం, చీమలాపల్లి, పురుషోత్తమపురం, వేపగుంట, వెంకటాపురంలో నెలకొన్న భూసమస్యలో చిక్కుని ప్రజలు నలిగిపోతున్నారు. విశాఖపట్నం తూర్పు, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, భీమిలి అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ గ్రామాలు ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకుని.. భూమి సాగుచేసుకుంటున్న పంచగ్రామాల రైతులకు 1996లో భూ సమస్య పిడుగుపాటుగా మారింది.
ఆయా గ్రామాల్లో 1730 ఎకరాల మాగాణి, మెట్ట, బంజరు, పోరంబోకు భూములు సింహాచలం దేవస్థానం అభివృద్ధి చెందక ముందు నుంచే స్థానికుల సాగుబడిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో సింహాచలం దేవస్థానం ఉండటం, విశాఖ నగరం క్రమంగా విస్తరించడంతో రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అప్పటి విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రిటైర్డ్ ఉద్యోగులకు భూములను అమ్మింది
పంచగ్రామాల భూములపై 1975 నుంచి 1995 వరకు ఎలాంటి వివాదాలు లేవు. వాటిని సాగు చేసుకుంటూ ప్రజలు హాయిగా జీవించారు. కానీ పెందుర్తి, చినగదిలి ఎమ్మార్వోలు.. 1996లో పంచగ్రామాల్లోని భూములు సింహాచలం దేవస్థానానికి చెందుతాయని రైతు వారీ పట్టాలు జారీ చేశారు. అప్పటి నుంచి నలుగుతున్న ఈ భూసమస్య ఇంతవరకు పరిష్కారంకాలేదు. పిల్లల చదవులు, పెళ్లి కోసం భూములు అమ్ముకోవాలన్నా వారికి ఆ హక్కులేదు. ఇంటికి రిపేర్లు చేయించుకోవాలన్నా.. బాత్రూమ్ పైకప్పు వేయించుకోవాలన్నా.. సింహాచలం దేవస్థానం అధికారులు అడ్డుకునే పరిస్థితి. పంచగ్రామాల్లోని వ్యవసాయ భూములు, నివాసాలన్నీ దేవస్థానానికే చెందుతాయని వాదిస్తారు.
1903 గిల్మెన్ సర్వే నివేదిక ప్రకారం పంచగ్రామాల సాగుదారులందరినీ జిరాయితీ రైతులుగా గుర్తించారు. అప్పటి నుంచి భూమి శిస్తు చెల్లిస్తున్నారు. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 1977లో రైతులకు జిరాయితీ సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది. అయితే 1996లో చినగదిలి, పెందుర్తి ఎమ్మార్వోలు.. రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వారి అభిప్రాయం తెలుసుకోకుండా ఈ భూములను సింహాచలం దేవస్థానానికి కట్టబెడుతూ పట్టాలు ఇచ్చారు. ఈ పరిణామాంతో హడలిపోయిన అడవివరం రైతులు తమ గ్రామంలోని 470 ఎకరాల జిరాయితీ భూములపై కోర్టును ఆశ్రయించారు.
రెవెన్యూ అధికారులు తమ నోటికాడ కూడు తీసేశారంటూ ఫిర్యాదు చేయడంతో కోర్టు స్టే ఇచ్చింది. మరోవైపు విజయనగరం రాజులు ఆ భూమును దేశస్థానానికి దానం చేశారని సింహాచలం అధికారులు చెప్పడంతో ఇక్కడి వాళ్ల పరిస్థితి అయోమయంలో పడింది. బోర్లు వేయించుకునే పరిస్థితి లేదు. బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం లేదు. రైతు రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలు వర్తించవు. అలాంటి దయనీయ పరిస్థితుల్లో పంచగ్రామాల ప్రజలు బతుకీడుస్తున్నారు