అద్దె అడిగినందుకు యజమాని గొంతు కోసి చంపాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిన్నపాటి ఘర్షణలే ప్రాణాలు తీసే వరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంతో నేరాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు కిరాయిదారు… యజమాని గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన కాంచిపురంలోని కుంద్రాతుర్‌లో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. అజిత్ అనే లారీ డ్రైవర్ కుటుంబంతో కలిసి గణశేఖరన్ కు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. నాలుగు నెలల నుంచి అజిత్‌ ఇంటి అద్దె చెల్లించడం లేదు. యజమాని పలుమార్లు వచ్చి అడిగినా రేపుమాపు అంటూ కాలయాపన చేశాడు.

ఎంత అడిగినా అద్దె ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన ఇంటి యజమాని విద్యుత్‌, నీటి కనెక్షన్‌ను తొలగించేశాడు. కరెంటు ఎందుకు కట్‌ చేశావని అజిత్‌.. యజమాని గుణశేఖర్‌తో వాగ్వాదానికి దిగాడు. అద్దె చెల్లిస్తేనే కరెంటు పెట్టిస్తానని యజమాని చెప్పడంతో.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

తీవ్ర కోపోద్రిక్తుడైన అజిత్‌.. యజమానిని చంపడానికి కత్తి తీసుకొచ్చాడు. భయంతో గుణశేఖరన్‌ రోడ్డుపై పరుగెత్తగా వెంబడించి గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన యజమాని చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts