Thipparaa Meesam - Movie Review

తిప్పరామీసం – రివ్యూ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా, ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తిప్పరామీసం’ రివ్యూ..

శ్రీ విష్ణు.. మంచి సినిమాలు చేస్తాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాడు. అంతే కాదు, అతను చేసే సినిమాలు కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గానూ ఉంటాయి. రీసెంట్‌గా ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఈ సారి కాస్త మాసీగా ఉండే క్యారెక్టర్‌తో, మదర్ సెంటిమెంట్‌తో ‘తిప్పరా మీసం’ అనే సినిమా చేశాడు. టీజర్, ట్రైలర్ మంచి ఇంటెన్సిటీతో ఉండడం.. శ్రీ విష్ణు కూడా హిట్ ట్రాక్ మీద ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. అందుకే సినిమా ముందే బిజినెస్ పూర్తయి పోయింది. అంతటి హైప్ సొంతం చేసుకున్న ‘తిప్పరామీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో హిట్ కొట్టి శ్రీవిష్ణు నిజంగానే మీసం తిప్పాడా? లేక ఆ పేరు కేవలం టైటిల్‌కి మాత్రమే పరిమితం చేశాడా.. అనేది చూద్దాం.

కథ : 
మణిశంకర్  చిన్న తనంలోనే డ్రగ్స్‌కి ఎడిక్ట్ అయి.. చివరికి తల్లిపైనే ద్వేషం పెంచుకుంటాడు. ఆమెను శత్రువులా చూస్తుంటాడు. ఇలాంటి మణిశంకర్ పెరిగి పెద్దయ్యాక ఒక పబ్‌లో డీజే గా పని చేస్తూ.. విపరీతంగా బెట్టింగ్స్ చేస్తూ కొన్ని ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ మధ్యలో మౌనికతో ప్రేమలో పడతాడు.

మరో పక్క తనకు వచ్చిన సమస్యల నుంచి బయట పడటానికి డబ్బు కోసం ఇల్లీగల్ గేమ్స్ ఆడుతుంటాడు. వాటి కారణంగా అతని జీవితం ఉహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మణిశంకర్ జీవితంలో చోటు చేసుకున్న ఆ మలుపు ఏమిటి? చివరికి తన తల్లి ప్రేమను అతను అర్ధం చేసుకుంటాడా? లేదా? అసలు అతను తల్లిని అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. 

నటీనటులు :
నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు ఈ సినిమాలో కూడా మణి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్‌ను ఎక్కువగా ఎంచుకునే శ్రీవిష్ణు, ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా ఎఫెక్టివ్‌గా చేశాడు. అతని నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్‌ అని చెప్పొచ్చు.. ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్‌గా ఉన్న పాత్రలే చేసిన శ్రీ విష్ణు ఈ సినిమాతో మాత్రం కాస్త డిఫరెంట్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇక తల్లి పాత్రలో రోహిణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్ నటి కావడంతో ఏ పాత్ర అయినా అవలీలగా చేయగల రోహిణి.. ఈమూవీలో తల్లి పాత్రలో నటించడం ఈ సినిమాకి చాలా కలిసొచ్చింది. ఆమె నటన వల్ల క్లైమాక్స్ ఎమోషన్స్ బలంగా పండాయి. ఇక ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘కాంచన 3’  సినిమాల్లో గ్లామర్ షోతో మెప్పించిన నిక్కీ తంబోలి ఈ సినిమాలో కాస్త పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించింది. తన నటనతో మెప్పించింది.

READ  తిప్పరామీసం-ఫస్ట్ లుక్

టెక్నీషియన్స్ : 
ఈ సినిమాకి డైరెక్టర్, నిర్మాణ భాగస్వామి అయిన కృష్ణ విజయ్.. ఈ సినిమాను మంచి పాయింట్‌తో తెరకెక్కించాడు. తన మొదటి సినిమా ‘అసుర’లానే ఈ సినిమాలో కూడా వైవిధ్యమైన పాయింట్‌ని టచ్ చేశాడు. సినిమాలో మిగతా ఎలిమెంట్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ నడిపించడంలో తడబడ్డాడు. అందుకే సెంటిమెంట్ కాస్త ఓవర్ డోస్ అయినట్టు అనిపించింది. సురేశ్ బొబ్బిలి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లవ్ సాంగ్స్ .. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్‌గా, మంచి విజువల్స్‌తో బ్యూటిఫుల్‌గా చూపించారు. ఎడింటింగ్‌లోనే ల్యాగ్ కనిపిస్తుంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ఫైనల్ వర్డ్ :  
ఓవరాల్‌గా చెప్పాలి అంటే శ్రీవిష్ణు హీరోగా.. మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. కథ, కథనాలు స్లోగా సాగడంతో ఆసక్తికరంగా అనిపించదు. డైరెక్టర్ తీసుకున్నది మంచి పాయింటే అయినా.. దానిని డెవలప్ చేయడంలో బాగా తడబడ్డాడు. ఆకట్టుకునే స్థాయిలో సినిమాను తీయలేకపోయాడు. సినిమాకు ఉన్నప్లస్ పాయింట్ ఏంటంటే శ్రీవిష్ణు యాక్టింగ్ అండ్ మదర్ సెంటిమెంట్. ఈ పాయింట్‌తో పాటు ఈ వారం సినిమాకు పోటీగా ఏ సినిమాలు లేకపోవడం.. ఈ సినిమాకు కలిసొస్తుందో లేదో చూడాలి.

Related Posts