రైతులకు శుభాకాంక్షలు…నవ భారతం కోసమే వ్యవసాయ సంస్కరణలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పార్లమెంటు ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే మార్కెట్లు కొనసాగుతాయని భరోసా ఇచ్చారు.

కనీస మద్దతు ధర, పంట సేకరణ ప్రక్రియలు యథాతథంగా కొనసాగుతాయని రైతులకు హామీ ఇచ్చారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు.. 21వ శతాబ్దపు భారత దేశానికి ఎంతో అవసరమని మోడీ అన్నారు.


ఈ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలలో రైతులు తమ పంట ఉత్పత్తులకు సంబంధించి మెరుగైన రేట్లను పొందుతున్నారని ప్రధాని వివరించారు.కరోనా సంక్షోభంలోనూ రికార్డుస్థాయిలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేశామన్నారు.

ఇవాళ(సెప్టెంబర్-21,2020)బిహార్ ​లో రూ.14వేల కోట్లు విలువైన 9 రహదారి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం బిహార్‌లోని 45,945 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఘర్‌తక్‌ ఫైబర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… నిన్న రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయి. రైతులకు నా శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ రూపురేఖలను మార్చే ఇలాంటి బిల్లుల అవసరం ఎంతగానో ఉంది. రైతులు, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసమే మా ప్రభుత్వం వీటిని తీసుకువచ్చింది.


ఈ బిల్లులు రైతులు సాధికారికత సాధించేలా తోడ్పడతాయి. రైతులు తమకు నచ్చిన చోట, నచ్చిన ధరకు పంటను అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నాయి. వీటి ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. మరో ముఖ్యవిషయాన్ని నేను స్పష్టం చేయదలచుకున్నాను. మండీలు(వ్యవసాయ మార్కెట్లు)కు ఇవి ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. నిజానికి మా ప్రభుత్వమే దేశ వ్యాప్తంగా మండీల ఆధునికీకరణ చేపట్టి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

కాగా, వ్యవసాయానికి సంబంధించిన ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులకు ఆదివారం రాజ్యసభ ‌ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఆదివారం రాజ్యసభ ఆమోదించింది. దీంతో వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది.


మరోవైపు, పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ను‌ కోరారు శిరోమణి అకాలీదళ్((SAD)‌అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్. ‌రెండు వ్యవసాయ బిల్లులని పునఃపరిశీలనకు మళ్లీ పార్లమెంటుకు పంపాలని కోరారు. మరోవైపు ఈ బిల్లులను రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.

Related Posts