దమ్ముంటే రాజీనామా చేయండి, మళ్లీ ఎన్నికలు పెట్టండి.. ఏపీలో 3 రాజధానుల రగడ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మూడు రాజధానుల అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీ రద్దు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలతో ఆన్‌లైన్‌లో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. రాజధాని మూడుముక్కల అంశంగా మళ్లీ ఎన్నికలకు వెళ్లేలా వైసీపీని డిమాండ్‌ చేయాలన్నారు. వైసీపీ అరాచకాలు పెరిగాయని.. దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులను ఎండగట్టాలని నేతలకు సూచించారు. కల్తీ మద్యం, శానిటైజర్‌ తాగి అనేక మంది చనిపోవడంపై నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.

ఈ కారణాలు అప్పుడెందుకు చెప్పలేదు:
మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజా తీర్పు కోరాలని టీడీపీ నేత, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. లేకపోతే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నారు. మూడు రాజధానులపై ఇప్పుడు చెబుతున్న కారణాలు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు.

ఎన్నికలు, ఉప ఎన్నికలు మాకు కొత్త కాదు:
టీడీపీ చేస్తోన్న విమర్శలపై అధికార వైసీపీ కూడా దీటుగా బదులిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయంపై అసెంబ్లీ రద్దు చేసి ప్రజాతీర్పు కోరాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌పై.. మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చారన్నారు. వైసీపీకి ఎన్నికలు, ఉప ఎన్నికలు కొత్తకాదన్న ఆయన… ముందుగా టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు.

దమ్ముంటే, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి:
చంద్రబాబు చాలెంజ్‌ ఓ కామెడీ సవాల్‌ అని ప్రభుత్వ చీఫ్‌ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తమను రాజీనామా చేయమనడం కాదని.. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలవాలని శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. గత కాంగ్రెస్‌ హయాంలో తాము రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కూర్చొని జూమ్‌ యాప్‌లో విమర్శలు చేయడం చంద్రబాబు ఇప్పటికైనా మానుకోవాలన్నారు.

మొత్తానికి మూడు రాజధానులపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీరంటే మీరు రాజీనామా చేసి గెలవాలన్న సవాళ్లు నేతలు చేస్తూ.. రాజకీయ వేడి పెంచుతున్నారు.

Related Posts