Suspension of 7 Congress MPs over unruly behaviour in Parliament revoked

ముగ్గురు ముగ్గురే.. కాంగ్రెస్ ఎంపీలది తలో దారి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గత ఏడాది జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నిక‌ల్లో ప్రధాని మోడీ హవాలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే.. తెలంగాణ రాష్ట్రంలో మూడు స్ధానాల్లో విజ‌యం సాధించి శెభాష్ అనిపించుకుంది. సంఖ్యా ప‌రంగా గెలిచామంటే గెలిచామే కానీ, ఆ గెలుపును పార్టీ బ‌లోపేతానికి ఏమాత్రం పనికి రాకుండా ఎంపీలు చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. నిజానికి ముందస్తుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్న నాలుగు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం విశేషమే. మూడు సీట్లను సాధించిన తర్వాత కూడా కార్యకర్తల్లో నిస్తేజమే కనిపిస్తోందంటే ఆ పార్టీ నాయకులే ఇందుకు కారణమని అంటున్నారు. 

నిజానికి ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ స‌భ్యులేమైనా సాదాసీదా వాళ్లో? లేక కొత్తగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారో కూడా కాదు. ముగ్గురూ ముగ్గురే. ఒక‌రు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అయితే, మ‌రొక‌రు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఇంకొకరు సీనియ‌ర్ నేత మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి. వీరిలో రేవంత్ ఒక్కరే పార్టీలోకి కొత్తగా వచ్చిన నేత. మిగిలిన ఇద్దరూ క‌రడుగ‌ట్టిన కాంగ్రెస్ నాయ‌కులే. అందులోనూ ఒకే జిల్లాకు చెందిన అగ్ర నేత‌లు. వీరి మ‌ధ్య కూడా స‌యోధ్య లేక‌పోవ‌డం పార్టీ దుర‌దృష్టక‌ర‌మ‌ని కార్యకర్తలు అంటున్నారు.

ఎవరికి వారే అన్నట్టుగా :
ఒక్కొక్కరిది ఒక్కో వింత పోక‌డ‌. అంద‌రినీ క‌లుపుకోవాల్సిన‌ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప‌ట్టించుకోరు. ఆయ‌న పిలిస్తే తమకేంటనే వారు మిగ‌తా ఇద్దరు. ఇదేదో అంత‌ర్గతంగా మాత్రమే ఉందనుకుంటే పొర‌పాటే. వీరి ఇగో ప్రద‌ర్శించ‌డానికి సంద‌ర్భం ఏంటన్న దానితో సంబంధం లేదంటున్నారు. లోక‌ల్‌గా క‌ల‌వ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నారనుకుంటే ఏదో అనుకోవచ్చు. చివరికి ఢిల్లీలోనూ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని గుసగుసలు ఆడుకుంటున్నారు. క‌నీసం రాష్ట్రంలో నెల‌కోన్న ప‌రిస్థితులు, ఆ స‌మ‌స్యల‌పై పార్లమెంట్ వేదిక‌గా పోరాడాల‌నే ఆలోచ‌న కూడా ఈ ముగ్గురు ఎంపీలు చేయ‌డం లేదంటున్నారు. 

రాష్ట్రంలో అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులంతా కలసి పని చేయాల్సి ఉంటుంది. అందులోనూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిపై ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా పార్టీ భ‌విష్యత్ మ‌నుగ‌డను ప్రశ్నార్ధకం చేసేలా ప్రవర్తిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కేసిఆర్‌ని, దేశంలో మోదీని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే మామూలు విషయం కాదు. పార్టీకి పూర్వవైభ‌వం తీసుకు రావాలంటే క్షేత్ర స్థాయి నుంచి క‌ల‌సిక‌ట్టుగా వెళ్లాలి. కానీ ఈ రాష్ట్ర నాయకులకు, ముఖ్యంగా ఎంపీలకు అస్సలు ఇవేవీ పట్టడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు.