తిరుమలలో మళ్లీ మొదలైన దళారీల దందా, దర్శనాల పేరుతో మోసాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

tirumala: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. లాక్‌డౌన్‌ బ్రేక్‌ తర్వాత దర్శనం దళారీలు మళ్లీ అక్రమ కార్యాకలాపాలకు తెరలేపారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. తిరుమలేశునికే తిరునామాలు పెడుతూ.. భక్తులను మోసం చేస్తున్నారు.

తిరుమల కొండపై గత ఆరు నెలలుగా VIP బ్రేక్ దర్శనాలు లేకపోవడం.. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 90 రోజులు ఆలయంలో దర్శనాలు నిలిపివేయడం వంటి కారణాలతో తిరుమలకు దూరమైన దర్శనం దళారీలు మళ్లీ తిరుమల బాటపట్టారు. శ్రీవారి దర్శనాలు ప్రారంభం కావడంతో.. తమ అక్రమాలకు పని చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లు పొంది బ్రేక్ దర్శనం టికెట్లు పొంది.. వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టడంతో పలువురు దళారీలు పట్టుబడుతున్నారు. తాజాగా పట్టుబడిన దళారీల్లో ఇద్దరు మహిళా దళారీలు కూడా ఉండడం సంచలనం రేకెత్తిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో మూడు దళారి కేసులను నమోదు చేసిన తిరుమల పోలీసులు.. ఆరుగురిని అరెస్టు చేశారు. మొదటిసారిగా మహిళా దళారులు ఇద్దరు పట్టుబట్టడం విశేషం. గతంలో దళారీలుగా ముద్రపడిన వారిని పోలీసులు బైండోవర్ చేయడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ తిరుమలలో భక్తులను మోసగించకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఏడాది కాలంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంలో సుమారు 900మంది దళారీలను అరెస్టు చేశారు. అయితే మళ్లీ దళారీలు తిరుమలపై కన్నేయడంతో పోలీసులు వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఎంతటి పలుకుబడి ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు.

గతంలో దళారీల ముద్ర పడిన వారిని తిరుమలకు రప్పించి ఇక నుండి అటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండేలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అలా కాదని తిరుమలకు వచ్చి గతంలో మాదిరిగా భక్తులను మోసం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భక్తులు శ్రీవారి దర్శనం టికెట్ల కోసం దళారీలను ఆశ్రయించకుండా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుమలలో తవ్వేకొద్దీ దళారీల అక్రమాలు బయటపడుతున్నాయి.

Related Posts