రూమర్లకు చెక్.. తిరుపతి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మళ్లీ పోటీ చెయ్యనున్నట్లుగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆమె టీడీపీ వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వస్తుండగా.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆమెనే బరిలోకి దిగుతారని లోకసభ నియోజకవర్గం పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రకటించారు.వైసీపీ సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కరోనా వైరస్‌తో మరణించగా.. ఖాళీ అయిన సీటుకు.. జనవరి తర్వాత ఎప్పుడైనా ఉప ఎన్నిక జరగవచ్చు. ఈ క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్ధులపై దృష్టి పెట్టగా.. SC రిజర్వుడు సీటు కావడంతో ముందుగానే చంద్రబాబు అభ్యర్ధి ప్రకటన చేశారు. ఉపఎన్నిక జరిగితే సంప్రదాయం పేరుతో టీడీపీ దూరంగా ఉంటుందని వచ్చిందనే వాదనలకు చెక్ పెట్టేశారు.


ఏకగ్రీవానికి సహకరిస్తారా? పోటీకి సిద్ధమవుతారా? బీజేపీకి మద్దతిస్తారా? తిరుపతి ఉపఎన్నికల్లో చంద్రబాబు వైఖరేంటి?


రాజకీయనాయకుడు ఎవరైనా మృతి చెందితే ఆ స్థానాన్ని వారి కుటుంబసభ్యులకు కేటాయించే పక్షంలో ఏకగ్రీవ ఎన్నికకు మిగతా రాజకీయపార్టీలు తమ అభ్యర్ధులను పోటీ పెట్టకుండా సహకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పోటీ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్లకు ఆయన చెక్ పెట్టినట్లుగా అయ్యింది. మరోవైపు తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున తిరుపతి నుంచి రాష్ట్ర మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును పోటీకి దించాలని బీజేపీ యోచిస్తోంది.

Related Tags :

Related Posts :