toilet-on-wheels-with-special-features-in-telangana1

ప్రత్యేక వసతులతో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌, రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌’ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అవసరమైన చోట్ల ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌’ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఆదేశించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ‘స్త్రీ టాయిలెట్ల’ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వీటిని తక్కువ వ్యవధిలో పూర్తిచేయడంతోపాటు కావాల్సినచోటికి తరలించే అవకాశం ఉంటుందన్నారు.

కాలం చెల్లిన బస్సులతో టాయిలెట్లు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే:
ఈ మేరకు పురపాలకశాఖ బుధవారం(జూలై 15,2020) ఉత్తర్వులు జారీచేసింది. సమీప ఆర్టీసీ డిపోల నుంచి కాలం చెల్లిన బస్సులను తీసుకొని వాటిని ‘స్త్రీ టాయిలెట్లు’గా మార్చాలని సూచించింది. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ల కోసం వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. వీటిని రద్దీ మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు, ప్రార్థనా మందిరాలు, నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు, వారాంతపు అంగళ్లు వంటి ప్రాంతాలకు తరలించవచ్చని అధికారులు చెప్పారు. వీటి నిర్వహణను స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్స్‌ (ఎస్‌ఎల్‌ఎఫ్‌) లేదా పట్టణ వికలాంగుల సమితి లేదా మహిళా సంఘాలు లేదా ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగించాలని సూచించారు. టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌కు సంబంధించిన డిజైన్‌, ఏర్పాటు చేయాల్సిన వసతులను అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) సూచించింది.

టాయిలెట్ ఆన్ వీల్స్‌లో ప్రత్యేక వసతులు:
* ఇండియన్‌, వెస్ట్రన్‌ కమోడ్‌
* వ్యర్థాల నిర్వహణకు బయో టాయిలెట్‌
* తగినంత గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు
* శానిటరీ ప్యాడ్‌ డిస్పెన్సర్‌ ఏర్పాటు
* వాష్‌ బేసిన్‌, అద్దం, కియోస్క్‌
* చంటిబిడ్డలకు తల్లులు పాలిచ్చేందుకు ప్రత్యేక స్థలం
* టాయిలెట్‌ నిర్వాహకులకు ప్రత్యేక గది
* ప్రకటనల బోర్డ్‌లకు ప్రత్యేక స్థలం
* టాయిలెట్‌ను శుభ్రంచేసే సామగ్రిని దాచే స్థలం
* సోలార్‌ ప్యానల్‌ (అవసరాన్ని బట్టి)
* దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేకంగా ర్యాంపు, లోపలి సౌకర్యాలు

అదనపు పరికరాలు/సౌకర్యాలు:
* శుభ్రమైన నీరు
* డోర్‌/కియోస్క్‌ వద్ద శానిటైజర్‌
* డస్ట్‌బిన్‌, చేతులు కడుక్కోవడానికి సబ్బు/హ్యాండ్‌వాష్‌
* డెయిలీ యూజ్‌, క్లీనింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ రిజిస్టర్లు
* కంప్లయింట్‌ బాక్స్‌, హెల్ప్‌లైన్‌ నంబర్‌
* ఓడీఎఫ్‌, కరోనా వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక డిస్‌ప్లే
* ఈ టాయిలెట్లలో ఒక చిన్న దుకాణం వంటిది ఉంటుంది. ఇక్కడ శానిటరీ ప్యాడ్లు, మాస్కులు వంటివి అమ్ముతారు.

READ  రూ.30లక్షల డబ్బు, 10 తులాల బంగారం ఎక్కడిది, తహసీల్దార్ సుజాతపై ప్రశ్నల వర్షం

Related Posts