హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్ల పరుగులు

  • Published By: murthy ,Published On : September 2, 2020 / 08:12 AM IST
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్ల పరుగులు

హైదరాబాద్ మహా నగరంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 21వ తేదీనుంచి పెళ్ళిళ్లు… అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతాయి.



కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్‌లాక్‌ -4 ఉత్తర్వులను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌ పార్కులు, థియేటర్లు ఇలాంటి ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 7వ తేదీనుంచి మెట్రో రైల్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్వోపీ) పాటిస్తూ లాక్‌డౌన్‌కు ముందు ఉన్న అన్ని కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నది.



మార్గదర్శకాలు ఇవీ..
> ఆన్‌లైన్‌ క్లాసులు, దూరవిద్యకు అనుమతి. ప్రోత్సాహం.
> 21 నుంచి ఆన్‌లైన్‌ టీచింగ్‌, టెలీకౌన్సెలింగ్‌, దీనికి సంబంధించిన పనులకు విద్యాసంస్థలకు ఒకే సమయంలో 50 శాతం టీచింగ్‌-నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు అనుమతి.
> 21 నుంచి ఐటీఐలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణకు, ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ, పీజీ టెక్నికల్‌ ప్రోగ్రాంలకు అనుమతి.


> ఈ నెల 21 నుంచి సోషల్‌, అకడమిక్‌, స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌, కల్చరల్‌, రిలీజియస్‌, రాజకీయ సమావేశాలతోపాటు ఇతర జనసమూహ కార్యక్రమాలను వందమందికి మించకుండా నిర్వహించుకోవచ్చు.
> ప్రస్తుతానికి బార్లు, క్లబ్‌లు బంద్‌. వీటిని ప్రారంభించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీచేస్తారు.