విశ్లేషణ: చైనా భారత్ మధ్య కుదిరిన ఫైవ్ పాయింట్ ఫార్ములా ఏంటి?

10TV Telugu News

India China Five Point Formula : గతంలో కుదిరిన ఒప్పందాలనే చైనా తుంగలో తొక్కింది. మళ్లీ ఇప్పుడు సరిహద్దుల్లో టెన్షన్ తగ్గించేందుకు కొత్తగా ఫైవ్ పాయింట్ ఫార్ములా ఫాలో అవుదామని చెబుతోంది. నెహ్రూ కాలం నాటి పంచశీల సూత్రాలకే దిక్కులేదు. మళ్లీ ఇప్పుడు కొత్తగా ఐదు అంశాల ప్రణాళిక ముందుకు తెచ్చింది. ఇంతకీ రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఫైనల్ అయిన.. ఆ ఫైవ్ పాయింట్స్ ఏంటి?

మొదటిది, విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలి. ఇరు దేశాధినేతలు వివిధ భేటీల్లో నిర్ణయించిన అంశాలను మార్గదర్శకంగా తీసుకొని ముందుకు సాగాలి.రెండవది, ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు రెండు దేశాలకు మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారు. అందువల్ల భారత్-చైనా సరిహద్దు దళాలు చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. సరిహద్దుల్లో వెంటనే సైనిక ఉపసంహరణ చేపట్టి ఎల్ఏసీ దగ్గర సమాన దూరం పాటించాలని నిర్ణయించారు. వీటి ద్వారా బోర్డర్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలన్నదే సెకండ్ పాయింట్.

మూడో పాయింట్, ఇప్పటివరకు సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య కుదిరిన అన్ని ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండాలి. సరిహద్దుల్లో శాంతిస్థాపనకు కృషి చేయాలి. ఉద్రిక్తతలు పెంచే ఎలాంటి చర్యలకు పాల్పడొద్దన్నది 3వ ప్రణాళిక.

నాలుగో పాయింట్, సరిహద్దు వివాదాల్ని ప్రత్యేక ప్రతినిధుల బృందం ద్వారా పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలి. ఆ దిశగా ఇప్పటికే ఏర్పడ్డ Working Mechanism for Consultation & Coordination on India-China Border Affairs (WMCC)‌ కమిటీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు.ఐదో పాయింట్, ఉద్రిక్తతలు తగ్గిన వెంటనే రెండు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే దిశగా నిర్మాణాత్మక చర్యల్ని వేగవంతం చేయాలి. ఇదే మాస్కో భేటీలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించిన ఫైవ్ పాయింట్ ఫార్ములా.

ఇక్కడే ఒక సంగతి. అనేక సార్లు కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డ చరిత్ర చైనాది. అందువల్లే తాజా ఒప్పందానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంటుందన్న నమ్మకం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్‌లో గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య భీకర ఘర్షణ జరిగిన తర్వాత సైనికాధికారులు చర్చించారు. వెంటనే బలగాల్ని ఉపసంహరించుకొని యధాతథ స్థితి నెలకొల్పాలని నిర్ణయించినా, చైనా వాటిని బేఖాతరు చేసింది.గల్వాన్ క్లాష్ తర్వాత చైనా బలగాలు వెనక్కి మళ్లినట్లే మళ్లితి కొద్దిరోజుల్లో తిరిగొచ్చేశాయ్. మళ్లీ అదే దూకుడు, దుందుడుకు చర్యలకు దిగాయ్. పదే, పదే ఎల్ఏసీ వెంట అతిక్రమణకు పాల్పడుతూ భారత్‌ను కవ్విస్తోంది డ్రాగన్ కంట్రీ. ఎలాగైనా రెచ్చగొట్టి యుద్ధానికి దారితీసేలా చేయాలని చూస్తోంది.

అందుకే.. చైనాను నమ్మడానికి వీల్లేదని చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పుడు వెనక్కి తగ్గినా.. మళ్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే బోర్డర్‌లో ఇండియన్ ఆర్మీ అప్రమత్తంగా ఉండాల్సిందే.