లంచం డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటున్న తహశీల్దార్

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 09:47 AM IST
లంచం డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటున్న తహశీల్దార్

మీ దగ్గర తీసుకున్న లంచం డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు ఓ తహశీల్దార్. ఎవరికి ఎంతివ్వాలో..ఓ పేపర్ రాసి మరీ సంతకం పెట్టి ఇచ్చాడు. దీనికి ఓ గడువు కూడ విధించాడు. అప్పటిలోగా..ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నానో తిరిగి వారికి ఇచ్చేస్తానని హామీనిచ్చాడు. ఈ ఘటన కొమరం భీం జిల్లా చింతమానెలపల్లిలో చోటు చేసుకుంది.



రైతుల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన కొంతమంది అధికారులు పక్కదారి పడుతున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ..లంచాలకు ఎగబడుతున్నారు. చింతలమానెపల్లి తహసీల్దార్ ఖాజా నియాజుద్దీన్ లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కలెక్టర్ 2020, జులై 29వ తేదీ బుధవారం అతడిపై చర్యలు తీసుకున్నారు.

జిలా కేంద్రానికి బదిలీ చేశారు. తెల్లారి..అంటే గురువారం..కొత్త అధికారి వచ్చి విధుల్లో చేరారు. తాము డబ్బులు ఇచ్చిన అధికారి వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న గ్రామస్తులు కార్యాలయానికి చేరుకున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేద పనులైనా చేయాలని భీష్మించు కూర్చొన్నారు.



ఒక్కో రైతు నుంచి రూ. 10 నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

కానీ గ్రామస్తులు వినిపించుకోలేదు. చివరకు ఆ తహశీల్దార్ ఎవరికి ఎంతివ్వాలో తెల్లకాగితం రాశాడు. వీరికి 2020, ఆగస్టు 18వ తేదీలోగా డబ్బులు ఇచ్చేస్తానని సంతకం చేసి ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.