సినిమా కధను తలపిస్తున్న పంజాగుట్ట అత్యాచారం కేసు

  • Published By: murthy ,Published On : August 25, 2020 / 12:33 PM IST
సినిమా కధను తలపిస్తున్న పంజాగుట్ట అత్యాచారం కేసు

హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన అత్యాచార కేసు తెలుగు  సినిమా క్రైం స్టోరీని తలపిస్తోంది. కేసు విచారణలో తలెత్తే అనేక సందేహాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారం చేశారని మిర్యాలగూడకు చెందిన యువతి చేసిన ఫిర్యాదుతో కేసులో ఎలా ముందుకు వెళ్లాలా అని అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు.



ఈ కేసును సీఐడీకి అప్పగించాలా, సీసీఎస్ కు అప్పగించాలా అనే దానిపై అధికారులు అంతర్గత మంతనాలు సాగిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలెట్టారు. కాగా ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది.

ఆధారాలు దొరకటం అసాధ్యం
9 ఏళ్లుగా తనపై అత్యాచారం జరుగుతుంటే ఏ రోజు నోరు మెదిపి కంప్లయింట్ ఇవ్వని మహిళ ఇప్పుడు కంప్లయింట్ ఇవ్వటంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తన ఫిర్యాదులో ఆమె ఇచ్చిన ఆధారాల ప్రకారం కేసు విచారిద్దామన్నా 9 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజ్ లు దొరకటం దుర్లభం. ఇన్నేళ్లలో పోలీసు స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? పోనీ తాను వెళ్ళిన పోలీసు స్టేషన్ లో పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు ? వేరే స్టేషన్ లో ఇవ్వోచ్చ కదా ?



అదీ కాదు…పోలీసులు నిర్లక్ష్యం గా వ్యవహరించారు ? అనుకుంటే మీడియా ముందుకు రావచ్చు…. ప్రెస్ క్లబ్ లోనో, మరో చోటో ప్రెస్ మీట్ పెట్టి తనపై జరుగుతున్న దారుణాన్ని ప్రపంచానికి చెప్పవచ్చు. మరి ఎందుకు బయట పెట్టలేదు ? అని బాధితురాలికి భరోసా సెంటర్ లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అడిగిన ప్రశ్నలలో కొన్నిటికే ఆమె సమాధానం చెప్పింది.

చంపేస్తామని బెదిరించారు
ఈ దారుణాన్ని ‘ఎక్కడైనా, ఎవరికైనా ఫిర్యాదు చేస్తే నిన్ను చంపేస్తాం…. నీకు వెనకా ముందు ఎవరు లేరు’ అని చాలా మంది కాల్స్ చేసి బెదిరించారని తెలిపింది. దాంతో ఆ వేధింపులు భరించలేక తానే ఆత్మహత్య చేసుకుందాం అని నిర్ణయం తీసుకొని మరణ వాంగ్మూలం కూడా రాసి పెట్టుకున్నట్లు బాధితురాలు తెలిపింది.



ఆమె చేసిన ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే లేవని సమాధానం చెప్పింది. కావాలంటే తాను వెళ్లిన హోటల్స్ కు తీసుకువెళతానని అక్కడ వారిని విచారించమని బాధితురాలు సలహా ఇచ్చింది. ఆ దిశగా ప్రయత్నం మొదలెట్టిన పోలీసులకు నిరాశే మిగిలింది. 9 ఏళ్లనాటి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు దొరకటం అసాధ్యం గా మారింది.

మాకేం తెలియదు…మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తోంది
కాగా…..అత్యాచారం జరిగి చాలా ఏళ్లయింది… ఆధారాలు దొరకవు కాబట్టే…. మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తోందని … ఆ అమ్మాయిని మేమెప్పుడూ చూడలేదని బాధిత మహిళ ఫిర్యాదు చేసిన 139 మందిలో కొందరు పోలీసుల వద్ద వాపోయారు. మరైతే ఇంత సంచలనంగా మారిన కేసులో వాస్తవాలు ఎంటి….అసలు సూత్రధారులు ఎవరు… బాధితురాలిని అడ్డం పెట్టుకుని ఎవరైనా మొత్తం కధ నడుపుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.



ఈకేసులో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కొందరు పోలీసులకు విన్నవించుకున్నారు. బాధితురాలి వెనుక ఒక ఎన్జీవో ప్రతినిధి ఉండి ఇదంతా నడిపిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందనే దానిపైనా పోలీసులు దృష్టి పెట్టారు.

ఈకేసు విచారణ ఏ విధంగా మొదలెట్టాలి? బాధితురాలు పేర్కోన్న అనుమానితులను విచారణకు ఏవిధంగా పిలవాలి ? వారిని ఏవిధంగా విచారించాలి ? ఆరోపణలకు ఆధారాలు ఎంత వరకు లభిస్తాయి ? ఈ కేసును పంజాగుట్ట పోలీసులతో విచారణ చేయించాలా ? సీసీఎస్ కు బదిలీ చేయాలా ? ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలా ? అనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే దర్యాప్తు వేగవంతం చేయాలనే యోచనలో పోలీసు ఉన్నతాధికారులున్నట్లు సమాచారం.