WPL 2023 DC vs RCB : బెంగళూరుకి మళ్లీ బ్యాడ్ లక్.. వరుసగా 5వ ఓటమి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL2023) టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి కలిసి రావడం లేదు. ఈ టోర్నీలో బెంగళూరుకి మరో పరాజయం ఎదురైంది. ఇది వరుసగా 5వ ఓటమి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఓటమిపాలైంది.

WPL 2023 DC vs RCB : బెంగళూరుకి మళ్లీ బ్యాడ్ లక్.. వరుసగా 5వ ఓటమి

WPL 2023 DC vs RCB : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL2023) టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి కలిసి రావడం లేదు. ఈ టోర్నీలో బెంగళూరుకి మరో పరాజయం ఎదురైంది. ఇది వరుసగా 5వ ఓటమి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఓటమిపాలైంది. 151 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరుని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఢిల్లీ.. బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేశారు. ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ ధాటిగా ఆడి 16 బంతుల్లోనే 37 పరుగులు చేసింది. రిచా స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్సులున్నాయి.

Also Read..UPW vs MI WPL 2023 : తిరుగులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం, చెలరేగిన కౌర్

కెప్టెన్ స్మృతి మంధన (8) మరోసారి విఫలం కాగా, ఓపెనర్ సోఫీ డివైన్ 21 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే 3 వికెట్లు తీయగా, తారా నోరిస్ 1 వికెట్ పడగొట్టింది. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టుకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ షెఫాలీ వర్మ తొలి బంతికే డకౌట్ అయింది. ఆ తర్వాత అలైస్(38), జెమీమా(32), మిర్జానే కాప్(32*), జెస్ జోనాసన్(29*) రాణించడంతో ఢిల్లీ జట్టు గెలుపొందింది.

Also Read..WPL 2023 GG vs DC : వామ్మో ఇదేం కొట్టుడు.. 28బంతుల్లోనే 76 రన్స్. 10ఫోర్లు, 5సిక్సులు.. లేడీ సెహ్వాగ్ ఊచకోత

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఏదైనా ఉందంటే అది బెంగళూరు మాత్రమే. ఇప్పటిదాకా 5 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ అన్నింటా ఓడిపోయింది. పోనీ ఆ జట్టులో స్టార్లు లేరా అంటే అదీ కాదు. స్మృతి మంధన, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, హీదర్ నైట్, మేగాన్ షట్, రేణుకా సింగ్, రిచా ఘోష్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. కానీ, ఇంతవరకు ఒక్క గెలుపు కూడా లేదు. అన్నీ పరాజయాలే. వరుస ఓటములతో బెంగళూరు జట్టు డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.