ఆ మూడు సీట్లపై గులాబీ నేతల్లో ఆశలు.. కేసీఆర్ ఎవరికి ఇస్తారంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ముఖ్యమంత్రి కేసిఆర్ సోమవారం గవర్నర్‌తో భేటీ సందర్భంగా శాసనమండలి స్థానాల భర్తీకి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చిందన్న ప్రచారం మొదలైంది. దీంతో గులాబీ నేతల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. గత కొన్ని రోజులుగా నామినేటెడ్ పదవుల కాలాన్నీ రెన్యువల్ చేస్తున్న సీఎం కేసీఆర్ శాసనమండలి స్థానాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తారని భావిస్తున్నారు.

ప్రస్తుతం భర్తీ చేయనున్న మూడు స్థానాలను గతంలో మూడు సామాజికవర్గాలకు చెందిన నేతలు పొందారు. ఇప్పుడు మరోసారి అవే సామాజికవర్గాలకు అవకాశం కల్పిస్తారా? కొత్త వర్గాల వారికి కేసీఆర్ అవకాశం ఇస్తారా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీ కాగా, మరో స్థానం వచ్చే నెలలో ఖాళీ కానుంది. అంతకు ముందే అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.

పొంగులేటికి అవకాశం ఇస్తారా? :
మూడు స్థానాల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందా అన్న అంశంపై పార్టీలో గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కొత్త పేర్లు తెరపైకి రావడంతో ఆశావహుల జాబితా మరింత పెరిగింది. పదవీ కాలం పూర్తయిన మాజీ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డికి మరో నామినేటెడ్ పోస్టు కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. రెడ్డి సామాజికవర్గాన్ని పరిశీలిస్తే….. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది.

గతంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న శ్రవణ్ రెడ్డి పేరు వినిపించింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో పొంగులేటికి అవకాశం ఇస్తారని అంచనా వేస్తున్నారు. రాజ్యసభ రేసులో ఉన్నా చివరి నిమిషంలో అవకాశం దక్కకపోవడంతో ఈసారి మండలికి కచ్చితంగా చాన్స్ ఇస్తారని చెబుతున్నారు.

ఈ స్థానం నుంచి మరోసారి ఆయనేనా? :
ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న కర్నె ప్రభాకర్ పదవీ కాలం వచ్చే నెలలో ముగియనుంది. ఈ స్థానం నుంచి మరోసారి ఆయననే కొనసాగించే చాన్స్‌ ఉందంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత బసవరాజు సారయ్యకు గతంలో ఇచ్చిన హామీని నేతలు గుర్తు చేస్తున్నారు.

ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ కూడా మండలి స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అదే సామాజికవర్గానికి చెందిన పీవీ కుమార్తె వాణి పేరు తెరపైకి వచ్చింది. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ కుటుంబానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మాజీ ఎంపీ సీతారాం నాయక్ తనకు పెద్దల సభకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారని అంటున్నారు. ప్రస్తుతానికి పేర్లు ఖరారు కాకపోవడంతో అధినేత దృష్టిలో పడేందుకు పార్టీ నేతలు ఎవరి రేంజ్‌లో వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

READ  కేసీఆర్ అంటే భయం లేదు: మే 23 తర్వాత అసలు సినిమా చూపిస్తాం

త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో మూడు స్థానాలకు అభ్యర్తులను ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత వారం పది రోజుల్లో పదవులను భర్తీ చేసే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ ఆశావహుల్లో ఎవరికి చాన్స్‌ దొరుకుతుందో చూడాల్సిందే.

Related Posts