కవిత దూకుడు, బతుకమ్మ వేడుకల విషయంలో కీలక నిర్ణయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ బతుకమ్మగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత.. రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వేడుకలను మాత్రం మళ్లీ గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతోపాటు రాజకీయంగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు కవిత సిద్ధమయ్యారని అనుచరులు అంటున్నారు.

ప్రస్తుతానికి ఏ పదవీ లేకున్నా.. గల్ఫ్‌ బాధితులకు ఆసరాగా నిలబడడం వెనుక కారణం అదేనంటున్నారు. ట్విటర్‌లో పిలిస్తే పలకడం, పేదలకు బాసటగా నిలుస్తుండటం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు.

మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్దం:
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు మాజీ ఎంపీ కవిత సిద్ధమయ్యారు. ఆమె గెలుపు లాంఛనమేనని భావిస్తున్నారు. పదవీకాలం తక్కువగా ఉన్నా ఏరికోరి ఆమెను సీఎం కేసీఆర్ ఈ పదవికి ఎంపిక చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమి అనంతరం చాలా రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న కవిత… ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దూకుడు పెంచాలని భావిస్తున్నారట.

ఇటు ఎమ్మెల్సీ పగ్గాలతో పాటు అటు తెలంగాణ జాగృతిని పటిష్టం చేసి దూకుడు పెంచాలని భావిస్తున్నారట కవిత. ఇప్పటికే ప్రత్యర్థుల కదలికలు, వారి రాజకీయ వ్యవహారాలపై నిఘా పెట్టారు. ఎంపీగా ఓడిపోయిన నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ హోదాలో మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్దం అవుతున్నారట.

తెలంగాణ జాగృతిని సైతం యాక్టివ్ చేసే యోచన:
పనిలో పనిగా తెలంగాణ జాగృతిని సైతం యాక్టివ్ చేయాలని కవిత భావిస్తున్నారట. నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టి, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించి జాగృతిని యాక్టివ్ చేశారంటున్నారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ సమాలోచన సభలో మాజీ ఎంపీ కవిత తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద వ్యూహామే ఉందంటున్నారు. బతుకమ్మ వేడుకలను జాగృతి తరఫున పెద్ద ఎత్తున నిర్వహించే యోచనలో ఉన్నారట.

చురుగ్గా సేవా కార్యక్రమాలు:
లాక్ డౌన్ సమయంలో జాగృతి తరపున వివిధ వర్గాలకు ఆర్థిక సాయం అందించిన కవిత.. గల్ఫ్‌లో చిక్కుకున్న చాలా మంది తెలంగాణ బిడ్డలను స్వగ్రామాలకు రప్పించడంలో కీలకంగా వ్యవహరించారు.

సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కూడా తెలంగాణ జాగృతిని పటిష్టం చేయనున్నారు. అంతే కాకుండా రాజకీయంగా దూకుడుగా ముందుకు వెళ్లాలని భావించిన ఆమె ప్లాన్‌ ప్రకారం అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

Related Posts