బీజేపీలోకి టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్? ఆ కోరిక తీర్చుకునేందుకేనట

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బీజేపీలో చేరతారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ నాయకుడు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా బీజేపీ చేరేందుకు రెడీ అయ్యారనే టాక్‌ మొదలైంది.

టీఆర్ఎస్ కు తీగల గుడ్ బై?
ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతితో భేటీ అయ్యారు. దీంతో ఆమె బీజేపీ గూటికి చేరతారనే పెద్ద ఎత్తున ఊహగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆమెను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఇక, తాజాగా టీఆర్‌ఎస్‌ నాయకుడు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఆయన త్వరలోనే కాషాయ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీలో చేరి 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిసరాల్లోని ఏదో ఒక లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.

సబిత రాకతో తీగలకు ఇబ్బందులు:
2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఆయన సైకిల్ దిగి కారు ఎక్కారు. ఇక, 2018లో టీఆర్‌ఎస్ టికెట్‌పై మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీచేసిన తీగల.. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిన తీగల.. ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ గూటికి చేరి.. మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ పరిణామాలు తీగలకు ఇబ్బందికరంగా మారాయి.

మామ బాటలోనే కోడలు:
తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. మహేశ్వరం టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీగా ఉన్న తీగల అనితారెడ్డి.. జడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి గట్టి పోటీని ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇక, ఒకవేళ తీగల టీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెబితే.. ఆయన కోడలు కూడా పార్టీకి వీడ్కోలు చెబుతారా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. మరి తీగల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Tags :

Related Posts :