లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

కేసీఆర్‌కు బాగా కావాల్సిన వ్యక్తి బీజేపీలో చేరబోతున్నారా?

Published

on

trs mandava : ఇందూరు పాలిటిక్స్‌లో మిస్టర్ కూల్ నేతగా పేరు పొందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భవిష్యత్‌పై చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరారు. అది కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాధారణంగా కేసీఆర్‌ అలా ఒక నేత ఇంటికెళ్లి పార్టీలో జాయిన్‌ చేసుకున్న సందర్భాలు అరుదు. కానీ, ఇద్దరికీ ఉన్న పరిచయాల నేపథ్యంలో మండవను పార్టీలో చేర్చుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు.

ఆయన రాజీనామా చేయడు, ఈయనకు పదవీ దక్కదు:
టీఆర్ఎస్‌ తరఫున నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్‌ కొంత కాలంగా పార్టీకి అంటీముట్టనట్టు ఉంటున్నారు. టీఆర్ఎస్‌ తీరుపై గుర్రుగా ఉన్నారు. అలా అని పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా మాత్రం చేయడం లేదు. పార్టీ కూడా ఆయనను సస్పెండ్‌ చేయడం లేదు. డీఎస్‌ రాజీనామా చేస్తే.. ఆ పదవిని మండవకు కట్టబెడతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ, ఆయన రాజీనామా చేయరు.. ఈయనకు పదవీ దక్కదు. దీంతో మండవ అనుచరులు పదే పదే పదవి గురించి ఆయనను ప్రశ్నిస్తుండడంతో ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదంటున్నారు.

మండవ ఫ్యూచర్ ఏంటి?
మండవ వెంకటేశ్వరరావు సాధారణంగా పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాదనే పేరుంది. కానీ, ఆయన ప్యూచర్ ఏంటనే ప్రశ్న కార్యకర్తల కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఆయన అనుచరులు ఇదే విషయాన్ని పదేపదే అడుగుతుండటంతో మండవ సైతం ఎవరిని అడగాలో? ఏం చేయాలో తెలియని పరిస్ధితిలో ఉన్నారని అంటున్నారు. గులాబీ గూటికి చేరి ఏడాది గడుస్తున్నా.. గుర్తింపు లేదని సన్నిహితుల దగ్గర ఫీలవుతున్నారట. కానీ, మండవకు గతంలో ఓ పదవికి ఆఫర్ చేశారట గులాబీ బాస్ కేసీఆర్‌. ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు పదవిని ఇస్తానన్నా.. మండవ సింపుల్‌గా తిరస్కరించారని టాక్‌.

టీఆర్ఎస్ వీడి బీజేపీలోకి వెళ్లాలని సలహాలు:
పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న మండవను పార్టీ మారాలంటూ కేడర్‌ కూడా ఒత్తిడి తీసుకొస్తోంది. కారు దిగి కమలం నీడలోకి వెళ్తే బాగుంటుందనే సలహాలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. టీడీపీలో ఉండగా ఎన్టీఆర్, చంద్రబాబుకు కుడిభుజంగా పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోను పెద్ద నాయకునిగా గుర్తింపు పొందారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీడీపీ పరిస్థితి దిగజారిపోయింది. అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న మండవను కేసీఆర్‌ స్వయంగా పార్టీలోకి ఆహ్వానం పలకడం సంచలనమైంది.

అనుహ్యంగా సురేశ్‌రెడ్డికి రాజ్యసభ సీటిచ్చి.. గౌరవం ఇచ్చిన కేసీఆర్:
అప్పటి నుంచి మండవకు మంచి పదవి వస్తుందని అందరూ ఊహించారు. పదవుల కోసం పార్టీ మారలేదని మండవ పదేపదే చెబుతున్నా.. అనుచరులు మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నారు. మండవ పార్టీలో చేరక ముందు.. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ సురేశ్‌ రెడ్డి సైతం కారెక్కారు. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు గులాబీ గూటికి చేరడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబి పార్టీ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ, అనుహ్య పరిణామాలతో ఎంపీగా పోటీ చేసిన కవిత ఓడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి పొలిటికల్ ఫ్యూచర్ కన్‌ఫ్యూజన్‌లో పడింది. కానీ అనుహ్యంగా సురేశ్‌రెడ్డికి రాజ్యసభ సీటిచ్చి.. గౌరవం ఇచ్చారు కేసీఆర్.

మండవకు మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. మండవకు పదవి వస్తుందా? లేదా? గులాబి బాస్ ఏ పదవిలో కూర్చోబెడతారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. కానీ కనుచూపు మేరలో ఆ అవకాశం లేకపోవడంతో పార్టీ మారడమే బెటర్‌ అని అనుచరులు అంటున్నారని టాక్‌. మరి కేసీఆర్‌ ఏదో ఒక పదవి ఇచ్చే వరకూ వెయిట్‌ చేస్తారా? కాషాయం కండువా కప్పేసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *