ఒకేవ్యక్తి రెండు సార్లు ఓటు వేయండి….దుమారం రేపుతున్న ట్రంప్ వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చ‌ట్టాన్ని ఉల్లంఘించాల‌ని అధ్య‌క్షుడు రెచ్చ‌గొట్ట‌డం స‌రికాదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే కోవిడ్ నేప‌థ్యంలో మెయిల్ ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. దీన్ని ట్రంప్ వ్య‌తిరేకిస్తున్నారు. మెయిల్ ఓటింగ్ ద్వారా డెమోక్ర‌టిక్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గురువారం నార్త్ క‌రోలినాలో ప్ర‌చారంలో ట్రంప్ మాట్లాడుతూ…..ప్రజ‌లు రెండు సార్లు ఓటేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌న్నారు.  ఓటర్లు  మెయిల్‌-ఇన్‌ పద్ధతిలో ఓటు నమోదు చేసుకున్న తర్వాత మరోసారి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి కూడా ఓటు వేయాలని ట్రంప్ తన మద్దతుదారులకు సూచించారు. ఈ ప‌ద్ధ‌తిలో ఓటింగ్ నిర్వ‌హిస్తే, అక్ర‌మాలు జ‌ర‌గ‌వ‌న్నారు. ఒకవేళ ఓ వర్గం వాదిస్తున్నట్లు మెయిల్‌-ఇన్ పద్ధతి సమర్థమైనదే అయితే.. పోలింగ్‌ కేంద్రంలో వేసిన ఓటు తిరస్కరణకు గురికావాలని వ్యాఖ్యానించారు.

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రెండు సార్లు ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం నేరం. ఆ దేశ ఎన్నిక‌ల సంఘం కూడా ఇదే చెబుతున్న‌ది. రెండుసార్లు ఓటు వేయాల‌ని ట్రంప్ కామెంట్ చేయ‌గానే.. నార్త్ క‌రోలినా ఎన్నిక‌ల బోర్డు ప్ర‌క‌ట‌న జారీ చేసింది. రెండు సార్లు ఓటు వేయ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌న్న‌ది. ఫెడ‌ర‌ల్ చ‌ట్టానికి విరుద్ధ‌మ‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది. ట్రంప్ ఆ వ్యాఖ్య‌లు చేసి నేరానికి పాల్ప‌డిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ఆరోపిస్తున్నారు.

తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్‌ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఆయన వ్యాఖ్యల్ని సవరించుకుంటూ వరుస ట్వీట్లు చేశారు. నవంబరు 3న ఉదయం వీలైనంత త్వరగా మెయిల్‌-ఇన్‌ పద్ధతిలో ఓటు వేయాలని కోరారు. ఒకవేళ అది నమోదు కాకుంటే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయాలని సూచించారు. ఇలా రెండుసార్లు ఓటేయాలన్న తన వ్యాఖ్యల్ని పరోక్షంగా సవరించుకునే ప్రయత్నం చేశారు. ఈ వివాదంపై స్పందించిన వైట్‌ హౌస్..ట్రంప్‌ చట్టవిరుద్ధ కార్యక్రమాల్ని ప్రోత్సహించలేదని తెలిపింది.

Related Tags :

Related Posts :