అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే… ట్రంప్ శాంతియుతంగా అధికార బదిలీ చేయరంట​ ​

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ ఏడాది న‌వంబ‌ర్- 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార పగ్గాలను శాంతియుతంగా బదిలీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే శ్వేతసౌధాన్ని శాంతియుతంగా విడిచిపెడతారా? అన్న ఓ జర్నలిస్ట్ ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు ట్రంప్​. ఏం జ‌రుగుతుందో వేచి చూడాల్సిందే అని ట్రంప్ అన్నారు. అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌హుశా సుప్రీంకోర్టు తేల్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న డౌట్ వ్య‌క్తం చేశారు.

కాగా, క‌రోనా నేప‌థ్యంలో ఈ సారి అమెరికా ఎన్నిక‌ల కోసం పోస్ట‌ల్ ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ-మెయిల్ ఓటింగ్‌పై ట్రంప్ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నికల్లో మెయిల్‌ ఇన్‌ ఓట్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. నెలరోజులుగా ట్విట్టర్‌తో సహా పలు వేదికలపై ట్రంప్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. విస్తృతమైన మెయిల్‌ ఓటింగ్‌ విధానం సురక్షితం కాదన్న ఆయన.. దీని వల్ల భారీ మోసాలు జరిగే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.


పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి బైడెన్ గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ట్రంప్ విమ‌ర్శించారు. డెమోక్ర‌టిక్ పార్టీ పోస్ట‌ల్ బ్యాలెట్‌తో రిగ్గింగ్‌కు పాల్ప‌డుతుంద‌ని ఆరోపించారు. బ్యాలెట్ విధానాన్ని తీసివేస్తే.. చాలా శాంతియుతంగా ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, అప్పుడు అధికార బ‌దిలీ ఉండ‌ద‌ని, కేవ‌లం కొన‌సాగింపు మాత్ర‌మే ఉంటుంద‌ని ట్రంప్ అన్నారు.


మరోవైపు, అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.

కాగా, ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ గెలిచే అవకాశాలున్నాయని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి.

Related Posts