TSRTC announces hike in bus fares | TSRTC | 10TV

కష్టాల్లో ఆర్టీసీ : ఆర్టీసీ ఛార్జీల పెంపు తప్పదా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయా ? పెరిగితే ఎంత పెరుగుతాయి ? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఛార్జీల పెంపుతోనే ఆర్టీసీ కోలుకొంటుందని నిపుణుల కమిటీ నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వకపోవడం..బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో మంజూరు చేయకపోవడంతో ఆర్టీసీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు పేమెంట్స్ ఇవ్వడానికి కూడా తీవ్ర కష్టాలు పడాల్సి వస్తోంది. వీటన్నిటికి చెక్ పెట్టాలంటే ‘ఛార్జీలు’ పెంపే మార్గమని యోచిస్తోందని టాక్. గత ఏడాది పెంచాల్సి ఉన్నా..ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. 
నష్టాల్లోనే ఆర్టీసీ…
నిత్యం వేలాది మంది ప్రయాణీకులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోడానికి ఆర్టీసీని ఆశ్రయిస్తుంటారు. వేల ఆర్టీసీ బస్సులు రయ్యి..రయ్యి మంటూ వెళుతుంటాయి. బస్సు పాస్‌లు..బస్సు ఛార్జీలు..ఇతరత్రా వాటిపై ఆర్టీసీ ఆదాయం సమకూరుతుంటుంది. అయినా..ఆర్టీసీ మాత్రం నష్టాల్లోనే కొనసాగుతూ ఉంటుంది. తాజాగా ఈ నష్టాలను భరించాలంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిందే..అంటూ సమావేశంలో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారంట. పెరుగుతున్న డీజిల్ ధరలు, నిర్వాహణ వ్యయం, కార్మికుల వేతనాల పెంపు, వడ్డీల చెల్లింపు వంటి అంశాలు ఆర్టీసీకి తీవ్ర భారంగా మారుతున్నాయి. ఇవన్నీ తీరాలంటే ఛార్జీల పెంపు అనివార్యంగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు టాక్. 
ఆస్తుల తాకట్టు ?
ఆర్టీసీని కష్టాల నుండి గట్టెక్కించాలంటే బడ్జెట్‌లో కనీసం ఒక శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్స్ ఉన్నాయి. అయితే నిధుల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రూ. 3వేల కోట్ల అప్పులపై ఏటా రూ. 250 కోట్ల వరకు ఆర్టీసీ సంస్థ వడ్డీలు చెల్లిస్తోంది. ఇటీవలే 16 శాతం ఐఆర్ పెరగడంతో కార్మికుల పేమెంట్స్ సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఆర్టీసీకి ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి డబ్బులు సర్దుబాటు చేస్తున్నట్లు టాక్. 
ప్రభుత్వం చిన్నచూపు…
విమానయానాన్ని ప్రోత్సాహించేందుకు విమాన ఇంధనంపై 16 శాతంగా ఉన్న వ్యాట్‌ని 1 శాతానికి కుదించిన సర్కార్ ఆర్టీసీకి సరఫరా చేసే డీజిలపై మాత్రం దాదాపు 27 శాతం వ్యాట్ విధిస్తోంది. మరోవైపు ఇటీవలే ప్రారంభమైన మెట్రో రైలు కూడా ఆర్టీసీపై ప్రభావం చూపిస్తోంది. నిత్యం లక్ష మందికిపైగా మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ వల్ల రోజుకు ఆర్టీసీ రూ. కోటికి పైగా నష్టం కలుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం వాటి నియంత్రణపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఆయా సంఘాలు తమ కార్యాచరణను నివేదిక రూపంలో విడివిడిగా నిపుణుల కమిటీకి సమర్పించింది. 

READ  బస్సుల తగ్గింపు : మెట్రో జోష్

Related Posts