TSRTC Official Guarantees For The Driver Babu Family

డ్రైవర్ బాబు కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం హామీలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరీంనగర్ – 2 ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబు కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం పలు హామీలు ఇచ్చింది. కుటుంబంతో చర్చలు జరిపింది. కుటుంబంలో ఆర్టీసీ తరపున ఒకరికి ఉద్యోగం, మరొకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని హామీనిచ్చారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. సరూర్ నగర్ సకల జన సమరభేరీలో పాల్గొన్న బాబు..హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోయాడు. ఆర్టీసీ జేఏసీ నేతలు, వివిధ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వంతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 

బాబు చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ బండి సంజయ్, ఇతర నేతలు కరీంనగర్‌కు చేరుకుని బాబు మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపేదాక అంత్యక్రియలు జరపమని..కుటుంబసభ్యులు, జేఏసీ, వివిధ పార్టీల నేతలు తేల్చిచెప్పారు. అప్పటికే బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం బాబు ఇంటికి ఆర్టీసీ ఉన్నతాధికారులు చేరుకుని చర్చలు జరిపారు. 

అంతకుముందు..అంత్యక్రియలు నిర్వహించడానికి నేతలు నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. డిపో వద్దకు తీసుకెళ్లడానికి కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో కొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. పోలీసులు..నేతలు, కుటుంబసభ్యలతో మాట్లాడిన అనంతరం ఇతరమార్గం గుండా భౌతికదేహాన్ని తీసుకెళ్లారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు..పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
Read More : టెన్షన్..టెన్షన్ : డ్రైవర్ బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత..లాఠీఛార్జ్

Related Posts