TSRTC Strike High Court Sensational Comments

ఆర్టీసీ సమ్మె : హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఎండీపై సీరియస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 2019, నవంబర్ 07వ తేదీ గురువారం జరుగుతున్న విచారణకు సీఎస్‌ జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులిచ్చిన నివేదికపై అసహనం వ్యక్తం చేసింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న న్యాయస్థానం… ఐఏఎస్ అధికారులే కోర్టుకు ఇలాంటి నివేదికలు ఇస్తే ఎలా  అని ప్రశ్నించింది. తమను తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు చూపారని… ఇంతవరకు ఏ బడ్జెట్‌లోనూ ఇలాంటి లెక్కలు చూడలేదని సీరియస్ అయింది. ఈ నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌ను అదేశించింది.

అయితే… రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే నివేదిక ఇచ్చినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. మొదటి నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా అంటూ మొట్టికాయలు వేసింది. ఆర్టీసీ ఎండీ లెక్కలు వేరేలా… మీ అంకెలు వేరేలా ఉన్నాయని.. వేటిని పరిగణనలోకి తీసుకోవాలని ఫైరయింది. తాజా నివేదికలో సమగ్ర సమాచారాన్ని అందించామని.. తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న రికార్డు ఆధారంగా  మొదటి నివేదిక ఇచ్చామని… దీనికి తమను మన్నించాలని కోర్టును కోరారు రామకృష్ణారావు. దీనిపై స్పందించిన న్యాయస్థానం క్షమాపణ కోరడం సమాధానం కాదని.. కోర్టులకు వాస్తవాలు మాత్రమే చెప్పాలని సీరియస్ అయింది.

ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదికను సైతం హైకోర్టు తప్పుబట్టింది. మీ నివేదిక ముఖ్యమంత్రిని, మంత్రులను కూడా తప్పుదోవ పట్టించేలా ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీనే అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. మీ బాస్‌కే తప్పుడు సమాచారం ఇచ్చిన వారు… మాకు నిజాలు చెబుతున్నారంటే ఎలా నమ్మాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్లతోపాటు.. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ జరపనుంది. కోర్టు తీర్పు అనంతరం సీఎం కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటు రూట్లపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరోవైపు.. 34వరోజు సమ్మె కొనసాగిస్తున్న కార్మిక సంఘాలు… సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 9న మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ నిర్ణయాలకు ఎవ్వరూ భయపడవద్దని… ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉన్నందున.. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం కుదరదని జేఏసీ నేతలు చెబుతున్నారు.  హైకోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుందని నమ్ముతున్నారు. 

READ  మీకు ఇంగ్లీష్ అర్థం కాలేదా : చంద్రబాబుని ప్రశ్నించిన సీఎం జగన్

ఎవరి ధీమా ఎలా ఉన్నా… ఆర్టీసీపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇప్పటికే పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో ఇవాళ  హైకోర్టు ఏదైనా కీలక ఆదేశాలు ఇస్తుందా ? అన్న అంశం ఉత్కంఠగా మారింది.
Read More : RDOను బెదిరించిన కానిస్టేబుల్: తహశీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే పడుతుంది   

Related Posts