Home » లైంగిక నేరాలకు పాల్పడిన మత ప్రబోధకుడు..1,075 ఏళ్లు జైలు శిక్ష
Published
2 weeks agoon
Turkish religious cult leader Adnan Oktar jailed for 1,075 years for sex crimes : వివాదాస్పద టర్కిష్ ముస్లిం మత ప్రబోధకుడు అద్నన్ అక్తర్(64) కు టర్కీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులు, ఆర్మీ గూఢచర్యం, బ్లాక్ మెయిలింగ్, తదితర నేరాల ఆరోపణలు రుజువు కావటంతో మొత్తం 1,075 ఏళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది.
అద్నన్ అక్తర్ ఏ9 అనే ఒక ప్రైవేట్ టీవీ చానల్ ద్వారా మతపరమైన బోధనలు చేస్తూ ప్రాచుర్యం పొందాడు. అసభ్యకరమైన దుస్తులు ధరించిన మహిళల మధ్య కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని ప్రతిబింబించేలా టీవీ షోలు నిర్వహించేవాడు. వారిని కిటెన్స్ అని పిలుస్తూ అసభ్యకర రీతిలో లైవ్ లో ప్రవర్తించేవాడు.
ఈ క్రమంలో అతడి కార్యకలాపాలపై నిఘా పెట్టిన టర్కీ మీడియా వాచ్డాగ్ ఇప్పటికే అతడి చానెల్‌పై నిషేధం విధించింది. మరోవైపు స్థానిక పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నన్ నివాసాలపై దాడులు చేసి, 2018లో అతడిని అరెస్టు చేశారు. అర్ధనగ్నంగా ఉన్న మహిళలను చుట్టూ పెట్టుకుని, మత బోధనలు చేయటంతో పాటు, తనకంటూ ఒక నేర సామ్రాజ్యాన్ని అతడు ఏర్పరుచుకున్నాడు.
అనేకానేక సెక్స్ స్కాండల్స్‌తో 90వ దశకంలో వెలుగులోకి వచ్చిన అద్నన్ అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువైంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ప్రిసైడింగ్ జడ్జి ఎదుట హాజరైన అతడు.. ‘‘ ఆడవాళ్లను చూస్తే నా గుండె ప్రేమతో ఉప్పొంగిపోతుంది. ప్రేమించడం అనేది మానవ సహజ లక్షణం. నేను అదే చేశాను.
నాకు దాదాపు వెయ్యి మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాడు. వారందరినీ సంతోషపెట్టగల అసాధారణ లైంగిక సామర్థ్యం నాకుంది’’ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. కాగా అమ్మాయిలకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించి వారితో అర్ధనగ్న ప్రదర్శనలు చేయించేవాడని కూడా అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
1990ల్లో పలు లైంగిక ఆరోపణలతో అడ్నాన్ నేర సామ్రాజ్యం బహిర్గతమైంది. 2011 నుంచి అతని టీవీ చానెల్ ఏ9 కార్యక్రమాలు ప్రసారం చేయడం ప్రారంభించింది. మహిళ మధ్య కూర్చుని మత ప్రబోధనలు చేయటాన్ని టర్కీలోని మత పెద్దలు ఖండించారు. అక్తర్ ను అరెస్ట్ చేయటానికి పోలీసులు వెళ్లినప్పుడు అతని ఇంటినుంచి 69 వేల గర్బ నిరోధక మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అడ్నాన్ అక్తర్ పై ఆరోపించబడిన కేసుల్లో 236 మంది నిందితులను న్యాయస్ధానం విచారించింది. వారిలో 78 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2016 లో టర్కీలో జరిగిన సైనిక, రాజకీయ తిరుగుబాటుకు ప్రధాన సూత్రధారి అని తేలింది. అతడితో పాటు పదుల సంఖ్యలోని అతని అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నేరాలను, నేరస్తులను ప్రోత్సహించడం సహా మైనర్లను లైంగికంగా వేధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం, బ్లాక్మెయిల్ చేయడం, రాజకీయ, సైనిక రంగాల్లో గూఢచర్యం నెరపినందుకు గానూ అద్నన్పై అభియోగాలు నమోదు చేశారు.
అమెరికాకు చెందిన ముస్లిం మతాధికారి ఫెతుల్లా గులెన్ నేతృత్వంలోని నెట్ వర్క్ కు సహాయం చేయటం కూడా ఈ ఆరోపణల్లో ఉంది. ఈ నేపథ్యంలో 10 ప్రధాన కేసుల్లో దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి ఈ మేరకు శిక్ష విధించింది. అతడి అనుచరుల్లో 13 మందికి సైతం కఠిన కారాగార శిక్షలు విధించింది.
కాగా ఈ విషయంపై స్పందించిన 64 ఏళ్ల అద్నన్.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను ఏ తప్పు చేయలేదని, పథకం ప్రకారమే కుట్ర పన్ని ఇరికించారని, కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక మత ప్రబోధనలతో పాటు రచయితగా కూడా అద్నన్ పేరు సంపాదించాడు. డార్విన్ జీవపరిణామక్రమానికి సంబంధించిన అంశాలపై హరున్ యహయా అనే కలం పేరుతో 770 పేజీల పుస్తకం రచించాడు.