ఐర్లాండ్ నుంచి వచ్చిన ఫోన్..ఢిల్లీ యువకుడ్ని కాపాడిన ముంబై పోలీసులు

  • Published By: nagamani ,Published On : August 10, 2020 / 11:10 AM IST
ఐర్లాండ్ నుంచి వచ్చిన ఫోన్..ఢిల్లీ యువకుడ్ని కాపాడిన ముంబై పోలీసులు

ఒక్క మాట మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. ఒక్క ఫోన్ కాల్ ఓ మనిషి నిండు జీవితాన్ని కాపాడుతుంది. మాట్లాడినవారు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా..ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్న బాధితులు కాపాడబడతారు. అదే జరిగింది ముంబైలో. ఎక్కడో ఐర్లాండ్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్..ముంబైలో ఆత్మహత్యకు యత్నించిన ఓ ఢిల్లీ యువకుడి ప్రాణాలను కాపాడింది.



వివరాల్లోకి వెళితే..ఢిల్లీ నుంచి వచ్చిన ఓ యువకుడు ముంబైలో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమోగానీ..ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ..తనకు జీవితంపై విరక్తి కలిగిందనీ..బ్రతకాలని లేదనీ..ఆత్మహత్య చేసుకుంటున్నాననీ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఫేస్ బుక్ అకౌంట్ తనది కాదు..ఓ మహిళది. ఆ మహిళ అకౌంట్ లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోస్ట్ పెట్టాడు.

ఆ పోస్ట్ ఐర్లాండ్ లో ఫేస్ బుక్ లో పనిచేస్తున్న ఓ అధికారి కంటపడింది. హా..ఎంతోమంది ఇలా పోస్టులు పెడుతుంటారని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తమయ్యాడు. అనుకున్న వెంటనే శనివారం (ఆగస్టు 9,2020) రాత్రి 7.51 గంటలు Delhi పోలీస్ సైబర్‌క్రైమ్ యూనిట్ డిసిపి అన్యేష్ రాయ్‌కు ఫోన్ చేసి ఓ మహిళ ఫేస్ బుక్ పోస్ట్ లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ పోస్ట్ వచ్చింది అది ఢిల్లీకి సంబంధించిన మహిళదని చెప్పాడు. అదే విషయాన్ని ఈ మెయిల్ కూడా చేశాడు.



వెంటనే రంగంలోకి దిగిన సైబర్ సెల్ అధికారులు..ఆ మహిళ ఫేస్ బుక్ ఖాతాను ట్రేస్ చేసి..ఫోన్ నంబర్ కూడా కనిపెట్టారు. ఆమె ఇంటికి వెళ్లారు. ఆత్మహత్య చేసుకుంటున్నానని పోస్ట్ చేసిన విషయం చెప్పారు. దీంతో ఆమె నిర్ఘాంతపోయింది. కంగారుపడింది.అది నా ఫేస్ బుక్ అకౌంటేనని..కానీ నేను అకౌంట్ ను వాడటంలేదనీ..నా భర్త వాడుతున్నాడని అతను ముంబైలో ఉంటున్నాడని చెప్పింది. తన భర్త ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది.

అలా అతను ముంబైలో ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముంబై పోలీసులకు చెప్పారు. అంతే..హుటాహుటిన ముంబై పోలీసులు ఫోన్ నంబర్ సిగ్నల్ ఆధారంగా ఆ యువకుడు ఉండే ఏరియాకు చేరుకున్నారు. అతను ఉన్న రూమ్ ను కనిపెట్టి వెంటనే అతని ఆత్మహత్య యత్నాన్ని ఆపారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ముంబై సైబర్ సెల్ డీసీపీ అనేశ్ రాయ్ తెలియజేశారు. ప్రస్తుతం అతని పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.