జీతం సరిపోలేదేమో : రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి

లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిది

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 11:00 AM IST
జీతం సరిపోలేదేమో : రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి

లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిది

లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిది పని చెయ్యడం లేదు. చేయి తడపనిదే ఫైల్ పై సంతకం పెట్టడం లేదు. కాదు కూడదు అంటే.. కాళ్లు అరిగేలా ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. కాగా, కొందరు బాధితులు ధైర్యం చేసి ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో అవినీతి అధికారులు, లంచావతారులు అడ్డంగా దొరికిపోతున్నారు. వారి బండారం బయటపడుతోంది.

తాజాగా ఓ అధికారి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వైద్య విధాన పరిషత్‌ గుంటూరు జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ చుండూరు ప్రసన్నకుమార్‌ బుధవారం(నవంబర్ 20,2019) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. బాపట్లకు చెందిన మధ్యవర్తి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి గోపీకృష్ణ ద్వారా డైట్‌ కాంట్రాక్టర్‌ తాడిబోయిన శ్రీనివాసరావు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్‌బాబు సిబ్బందితో పట్టుకున్నారు. 

కాంట్రాక్టర్‌ శ్రీనివాసరావు బాపట్ల, తెనాలి ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం (డైట్‌) సరఫరా చేస్తుంటారు. అందుకు సంబంధించిన బిల్లులను జిల్లా వైద్య విధాన పరిషత్‌ కార్యాలయం మంజూరు చేయాలి. రూ.20 లక్షలు బిల్లు మంజూరయ్యాయి. అయితే ఆ డబ్బుని కాంట్రాక్టర్ కు ఇవ్వడం లేదు. బిల్లు మంజూరై 3 నెలలు అవుతున్నా కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ అనేక కొర్రీలు పెడుతూ వచ్చారు. చివరికి మనసులో మాట చెప్పారు. తనకు 15 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేని కాంట్రాక్టర్ చెప్పడంతో చివరకు 5 శాతం అంటే రూ.లక్ష ఇవ్వాలని తేల్చి చెప్పాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్‌.. ఏసీబీని ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. స్కెచ్ వేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు 19వ తేదీన ప్రసన్నకుమార్‌కు కాంట్రాక్టర్‌ శ్రీనివాసరావు ఫోన్‌ చేసి రూ.లక్ష సిద్ధం చేశానని చెప్పారు. అయితే ఆ నగదును తనకు కాకుండా బాపట్ల ఆసుపత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న గోపీకృష్ణకు ఇవ్వాలని ప్రసన్నకుమార్ సూచించారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్‌ గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్‌ కార్యాలయం దగ్గర ఉన్నాని చెప్పగా బాపట్ల నుంచి వచ్చిన గోపీకృష్ణ రూ.లక్ష తీసుకుంటున్న సమయంలో ఏసీబీ  అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని విచారిస్తే డాక్టర్‌ ప్రసన్న కుమార్‌ పేరు చెప్పాడు. దీంతో ప్రసన్నకుమార్ తోపాటు గోపీకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వేలకు వేలు జీతం ఇస్తున్నా.. ఇంకా లంచాల కోసం వేధించడం ఏంటని మండిపడుతున్నారు. ఇలాంటి అవినీతిపరులను, లంచాధికారులను కఠినంగా శిక్షిస్తే కానీ.. అధికారుల్లో మార్పు రాదని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అంతా అవినీతిపరులు అని, లంచావతారులు అనే ముద్ర ప్రజల్లో ఉంది.