డబ్బు కోసం కక్కుర్తి: నెల్లూరు సింహపురి హాస్పిటల్ గుర్తింపు రద్దు

  • Published By: vamsi ,Published On : May 2, 2019 / 07:29 AM IST
డబ్బు కోసం కక్కుర్తి: నెల్లూరు సింహపురి హాస్పిటల్ గుర్తింపు రద్దు

అవయవదానం అంటే చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడమే. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా కొందరు డాక్టర్లు కకృత్తి కాసులు కోసం నాశనం చేస్తున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం అయిన నెల్లూరులో ఇటువంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. అవయవదానం ముసుగులో వ్యాపారం చేస్తున్న నెల్లూరులోని సింహపురి ఆసుపత్రి గుట్టు రట్టయ్యింది.

వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన ఏకుల శీనయ్య అనే వ్యక్తి ఏప్రిల్‌ 17వ తేదీన రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే శీనయ్యను చికిత్స కోసం నెల్లూరులోని సింహపురి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. 2రోజులు వైద్యం చేసిన డాక్టర్లు రూ.1.20లక్షల బిల్లు వేసి, బ్రెయిన్‌ డెడ్‌ అయిందని వెల్లడించారు. శీనయ్య మృతదేహం అప్పగించాలంటే మాత్రం ఆసుపత్రి బిల్లు చెల్లించాలని పట్టుబట్టారు. బిల్లు కట్టకుండా ఉండాలంటే అవయవదానంకు అంగీకరించాలని శీనయ్య భార్య అరుణను కోరారు. డబ్బు కట్టే స్తోమత లేని కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకున్నారు. అయితే అనంతరం మృతుని భార్య అరుణ నోరు విప్పడంతో అసలు విషయం వెలుగుగలోకి వచ్చింది. 

కార్పోరేట్ ఆసుపత్రి సింహపురిపై జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు విచారణకు ఆదేశించడంతో.. కావలి సబ్‌ కలెక్టర్‌ శ్రీధర్‌, డీఎంహెచ్‌వో వరసుందరం నేతృత్వంలో డాక్టర్ల బృందం విచారణ చేపట్టింది. అవయవదానంకు ముందే కిడ్నీ ఉపయోగపడుతుందని వైద్యులు నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తించిన అధికారులు ప్లాన్ ప్రకారమే అవయవదానంకు కుటుంబ సభ్యులను ఒప్పించినట్లు గ్రహించింది. పెద్దమొత్తంలో బిల్లువేసి బందువులను బయపెట్టడానికి కారణం కూడా అదేనని వారు గుర్తించారు.

గత నెల(ఏప్రిల్) 26వ తేదీన బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం సింహపురి ఆసుపత్రి గుర్తింపును రద్దు చేస్తూ నోటీసులు జారీ చేయాలని  డీఎంహెచ్‌వో నోటీసులు జారీచేసింది ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరేట్‌. ఆసుపత్రి గుర్తింపు రద్దు చేయాలని ఆదేశించారు. దీనిపై 15 రోజుల్లోగా ఆసుపత్రి యాజమాన్యం స్పందించాలని కోరారు. ఇప్పటికే సింహపురి ఆసుపత్రిపై నెల్లూరు గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.