నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ : వైసీపీలోకి శివాజీరాజా!

  • Published By: vamsi ,Published On : March 21, 2019 / 07:24 AM IST
నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ : వైసీపీలోకి శివాజీరాజా!

నామినేషన్ల పర్వం ఓ వైపు జోరుగా సాగుతోంది. మరోవైపు చేరికలతో హడావిడి. ఇంకో వైపు అభ్యర్ధులు మిస్సింగ్ అంటూ కలకలం. వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి మరీ కొట్టుకుంటున్నాయి. సినిమా వాళ్లు చంద్రబాబు- జగన్- పవన్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తాజా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ఊహించని నిర్ణయం తీసుకున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు.
Read Also : జేడీని చూడగానే జగన్ కు దడ.. వైసీపీ కబ్జాల నుంచి ఆయన కాపలా : పవన్

నిన్నటికి నిన్న అంటే మార్చి 19వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా మాట్లాడిన శివాజీ రాజా.. ‘మా’ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా పని చేసిన కొణిదెల నాగబాబు (పవన్ కల్యాణ్ అన్నయ్య, చిరంజీవి తమ్ముడు)కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ వ్యాఖ్యానించారు. నాగబాబుపై ఏ ఉద్దేశంతో అటువంటి వ్యాఖ్యలు చేశాడా? అనే విషయం ఎవరికీ అర్థం కాలేదు.

ఎలా ఢీకొడతాడా అని అందరూ చర్చించుకోవడంతో ఇండస్ట్రీలో పెద్ద టాపిక్ అయింది. శివాజీ రాజా మెగా ఫ్యామిలీతో ఎందుకు పెట్టుకుంటున్నాడు అని కూడా అనుకున్నారు. వీటికి సమాధానం దొరికేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నటుడు శివాజీరాజా జాయిన్ అవుతున్నట్లు స్పష్టం అయ్యింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

శివాజీరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నాగబాబుకి వచ్చిన కష్టం-నష్టం ఏంటీ అనే డౌట్ అందరిలో ఉంది. శివాజీరాజా పుట్టింది భీమవరంలో. క్షత్రియులు(రాజలు) ఎక్కువగా ఉండే భీమవరంలో తన వర్గం బలంగా ఉంది అక్కడ. సినీ ఇండస్ట్రీలో రాజుల మద్దతుతోపాటు భీమవరంలో తన సొంత వర్గాన్ని జనసేనకు వ్యతిరేకంగా పని చేయించేందుకు శివాజీ రాజా ప్రయాత్నాలు చేస్తున్నారు. భీమవరం నుంచే పవన్ కల్యాణ్ కూడా పోటీ చేస్తుండగా.. నాగబాబు పోటీ చేస్తున్న నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనే భీమవరం కూడా ఉంది. సో.. శివాజీరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేయటం కన్ఫామ్ అయిపోయినట్లే. ఇంకేముందీ.. రిటర్న్ గిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది.
Read Also : కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా