నాగోబా జాతరలో ‘22 పొయ్యి’ల ప్రత్యేకత ఏంటో తెలుసా  

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 10:07 AM IST
నాగోబా జాతరలో ‘22 పొయ్యి’ల ప్రత్యేకత ఏంటో తెలుసా  

ఆదిలాబాద్ లోని ఆదివాసీయుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ నాగోబా జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ గిరిజన జాతర నాగోబా జాతర. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర శుక్రవారం (24.01.2020) పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభంకానుంది. 

3

గోదావరి  జలంతో నాగోబాకు అభిషేకం..
ఆదివాసీల ఐక్యత, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ జాతరలో ప్రతి ఘట్టం ప్రత్యేకతే. ప్రతి సంవత్సరం తెలుగు నెలల ప్రకారం పుష్యమాసం ప్రారంభంలో నెలవంక కనిపించిన రెండవ రోజు మెస్రం వంశీయులు నాగోబాకు తొలిపూజ చేస్తారు. అమావాస్య రోజు అర్థరాత్రి నాగోబాకు గోదావరి జలంతో అభిషేకం చేసి మహాపూజలు నిర్వహిస్తారు. పుష్య అమవాస్యకు మొదలుకాగానే పవిత్ర జలాలతో మెస్రం వంశస్థులు నాగోబాను అభిషేకించడంతో జాతర ప్రారంభమవుతుంది. వారంరోజుల పాటు జరిగే ఈ జాతరలో నూతన జంటలను దేవుడికి పరిచయం చేసి పూజ చేయిస్తారు.

 4
కాలినడకన కెస్లాపూర్ కు : మర్రిచెట్ల కింద విశ్రాంతి 
మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకుని కాలినడకన నాలుగు రోజుల కిందట కెస్లాపూర్‌కు చేరుకుంటారు. అలా అక్కడికి చేరుకున్నవారు నాగోబా ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్ల కింద వారు సేద తీరారు. అనంతరం పుష్యమాసం అమావాస్య అర్థరాత్రి నుంచి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజల అనంతరం జాతర ప్రారంభమవుతుంది. 

మెస్రం వంశీయులే అర్చకులు
మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తూ నాగోబాకు గిరిజన సంప్రదాయ ప్రకారం మహాపూజలు చేస్తారు.ఈ  మెస్రం వంశంలోకి 22 తెగలు వస్తాయి. అందులో ఏడుగురు దేవతలను కోలిచేవారంతా మెస్రం వంశస్థులు. 

poyyi
22 పొయ్యిల ప్రత్యేక.. 
జాతరకు వచ్చే మెస్రం వంశీయులకు చెందిన మహిళలు వంటలు చేసుకునేందుకు మాత్రం గోవాడలో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజలకు అవసరమయ్యే నైవేద్యాలు ఇక్కడే సిద్ధం చేస్తారు. 22 పొయ్యిలు.. అక్కడే వంట నాగోబా జాతరకు ఎంతమంది మేస్రం వంశీయులు వచ్చినా.. పెట్టేది మాత్రం 22 పొయ్యిలే. ఎవరికివారు ఇష్టమొచ్చినట్లు పొయ్యిలు పెట్టుకుని వంట చేసుకోవడానికి వీల్లేదు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ పొయ్యిలు పెట్టుకోకూడదు. 

ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రహరీ గోడ లోపల మాత్రమే పొయ్యిలు పెడతారు. ఆ గోడకు చుట్టూరా దీపాలు వెలిగించేందుకు చిన్న అరలు ఉంటాయి. అందులో పెట్టే దీపాల కాంతుల వెలుగులోనే వంటలు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో మాత్రమే 22 పొయ్యిలు పెడతారు. మేస్రం వంశీయులు వేలాదిగా తరలివచ్చినా సరే.. ఆ 22 పొయ్యిల మీదే వంతుల వారీగా వంటలు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు నాగోబా జాతరకు 
వారం రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.