‘ఆహా’ అదిరిపోయే ప్లాన్.. భారీ సినిమాల బంపర్ ఆఫర్..

  • Published By: sekhar ,Published On : August 31, 2020 / 05:00 PM IST
‘ఆహా’ అదిరిపోయే ప్లాన్.. భారీ సినిమాల బంపర్ ఆఫర్..

Aha Big Releases: ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంలవైపే మొగ్గుచూపుతున్నారు. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తెలుగులో తొలి ఓటీటీగా ఆడియెన్స్ ముందుకొచ్చిన ‘ఆహా’ తక్కువ సమయంలోనే అందరికీ చేరువైంది.

కొత్త కంటెంట్‌తో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌లు అలాగే తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలను డబ్ చేసి ప్రేక్షకులకు అందిస్తూ మంచి ఆదరణ దక్కించుకుంది. లాక్‌డౌన్ టైంలో వారానికో సినిమా చొప్పున విడుదల చేస్తూ శుక్రవారం సినిమా రిలీజ్ సందడిని ఓటీటీలోకి తీసుకొచ్చింది ‘ఆహా’.. ఇటీవల ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, భానుమతి&రామకృష్ణ, ‘జోహార్’ వంటి సినిమాల ‘ఆహా’ ద్వారా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి.

ప్రస్తుతం యువతను ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లతో పాటు కొత్త సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో రానున్న ఆరు నెలల్లో ఏకంగా 42 సినిమాలు(వెబ్ సిరీస్‌లు కూడా భాగంగా) విడుదల చేసే భారీ ప్లాన్‌లో ఉంది ‘ఆహా’ యాజమాన్యం. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన పలు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి ఆడియెన్స్‌కు అందించనుంది ‘ఆహా’.