అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: భూ యజమానుల వివరాలు

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: భూ యజమానుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆరంభమైంది. ఈసందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడితో సహా పార్టీ నాయకులు, అనుచరులు కొనుగోలు చేసిన స్థలాల వివరాలు చదివారు. హెరిటేజ్ పేరిట కొన్న స్థలాలను చెప్పి టీడీపీ నాయకుల వివరాలు బయటపెట్టారు. బుగ్గన తెలిపిన వివరాలతో పాటు వైసీపీ వర్గాల నుంచి ఇన్‌సైడర్ ట్రేడింగ్ గురించి వివరాలిలా ఉన్నాయి. 

– చంద్రబాబు సన్నిహితుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీఆర్‌ ఆంజనేయులు తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబర్‌ 430/1, 430/3లలో సెప్టెంబరు 23, 2014న ఎకరం రూ.22.62 లక్షల చొప్పున తన తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో భూములు కొన్నారు. మందడంలో గోనుగుంట్ల సత్యనారాయణ, కుమార్తె లక్ష్మీ సౌజన్య పేరుతో 9.65 ఎకరాలు కొన్నారు. వెలగపూడిలో 4.71, కొండమరాజుపాలెంలో 2.04, ఐనవోలులో 2.43, నేలపాడులో 4.03, నీరుకొండలో 1.29, వెంకటపాలెంలో 0.7 ఎకరాలను లక్ష్మీసౌజన్య పేరుతో కొన్నారు. లింగాయపాలెంలో సత్యనారాయణ పేరుతో 1.25 ఎకరాలు, సన్నిహితుడు కొత్త వెంకట ఆంజనేయులు, కొత్త శివరామకృష్ణల పేర్లతో వెంకటపాలెంలో 0.60 ఎకరాలు కొన్నారు. మందడంలో 2.985 ఎకరాలను జీవీఆర్‌ ఆంజనేయులు కొనుగోలు చేశారు. 

– చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌ ప్రసాద్‌ డైరెక్టర్‌గా ఉన్న సెవెన్‌ హిల్స్‌ లాజిస్టిక్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గోష్ఫాద గ్రీన్‌ ఫీల్డ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేర్లతో తుళ్లూరు, వైకుంఠపురం, మందడం, వెంకటపాలెం, ధరణికోటలలో 25.91 ఎకరాలు కొనుగోలు చేశారు. నారా లోకేష్‌ సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు ప్రతినిధిగా ఉన్న ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున శాఖమూరు, వెలగపూడి, ధరణికోటలో 5.16 13.15 ఎకరాలు కొన్నారు. ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున కంతేరులో 13.15 ఎకరాల కొన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ భూములన్నీ డిసెంబర్‌ 30, 2014లోపు కొన్నవే.

– పయ్యావుల కేశవ్‌ తుళ్లూరు మండలం ఐనవోలులో సర్వే నెంబరు 48/3లో 2.13 ఎకరాలను ఎకరం రూ.6.39 లక్షల చొప్పున తన కుమారుడు విక్రమసింహా పేరుతో కొనుగోలు చేసి అక్టోబర్‌ 13, 2014న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఐనవోలులోనే ఎకరం రూ.5.88 లక్షల చొప్పున మరో 1.96 ఎకరాలను విక్రమసింహా పేరుతో నవంబర్‌ 3, 2014న కేశవ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కొండమరాజుపాలెంలో పయ్యావుల విక్రమసింహా పేరుతో 4.84 ఎకరాలు, తన సోదరుడి కుమార్తె హారిక పేరుతో 1.18 ఎకరాలను కేశవ్‌ కొనుగోలు చేశారు. 

– చంద్రబాబు సన్నిహితుడు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అభినందన హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున ఫిరంగిపురం, జి.కొండూరు మండలం వెంకటాపురం, నవులూరు, ఆత్మకూరు, కంకిపాడు మండలం పమిడిముక్కల, జగన్నాథపురం, ఇబ్రహీంపట్నంలలో జూన్‌ 19, 2014న రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ నెంబర్‌ 5704, 5704, 5706ల ద్వారా, జూలై 22, 2014న రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ నెంబర్‌ 7627 నుంచి 7637 వరకు 60 ఎకరాలను రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొన్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది.

– తాడికొండలో 2014 జూన్‌ 6న అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు సర్వే నెంబర్‌ 93–బీలో 7.12 ఎకరాలను తన అల్లుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు పుట్టా మహేష్‌ కుమార్‌ పేరుతో కొనుగోలు చేశారు. విజయవాడకు చెందిన జీబీఆర్‌ హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ గడ్డం బుచ్చారావుకు చెందిన ఈ భూమిని ఎకరం రూ.21 లక్షల చొప్పున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మరో రెండు రోజులకు అంటే జూన్‌ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 

– అమరావతి మండలం వైకుంఠపురం సర్వే నెంబర్‌ 257లో 1.12 ఎకరాలను ఎకరం రూ.1.12 కోట్ల చొప్పున గుమ్మడి సురేశ్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నవంబర్‌ 21, 2014న రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అనంతవరం, నిడమర్రు, మంగళగిరి, పెదపరిమి గ్రామాల్లో కూడా 30.32 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. గుమ్మడి సురేష్‌ ఆదాయ మార్గాలు,  ఆదాయపు పన్ను చెల్లింపులను పరిశీలించిన సీఐడీ అతడికి అంత భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసే స్థోమత లేదని నిర్దారణకు వచ్చింది. గుమ్మడి సురేష్‌కు, ప్రత్తిపాటి పుల్లారావుకు ఉన్న సన్నిహిత సంబంధాలపై ఆధారాలను సేకరించింది. 

– ధూళిపాళ్ల నరేంద్ర తుళ్లూరు మండలం కొండమరాజుపాలెం 1.21 ఎకరాలను ఎకరా రూ.6.05 లక్షల చొప్పున తన కుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి పేరుతో కొనుగోలు చేశారు. ఐనవోలులో 69–1లో 0.22, 69–2లో 1.86 ఎకరాలను కుమార్తె పేరుతో కొన్నారు. ఈ భూములను డిసెంబర్‌ 2014కు ముందే కొనుగోలు చేసి రాజధాని ప్రకటన వెలువడ్డాక రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 

– తెలంగాణ నేత వేం నరేంద్రరెడ్డి తన కుమారుడు వేం కృష్ణ కీర్తన్‌ పేరుతో ఐనవోలులో 1.99 ఎకరాలు, కొండమరాజుపాలెంలో 0.50 ఎకరాలను కొనుగోలు చేశారు. తనకు సన్నిహితుడైన వేమీశ్వర్‌రెడ్డి పేరుతో కొండమరాజుపాలెంలో 1.20 ఎకరాలను డిసెంబర్‌ 30, 2014కు ముందే కొన్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.

– తుళ్లూరు మండలం నేలపాడు సర్వే నెంబర్‌ 112/డీలో తన కుమారుడు పల్లె కృష్ణ కిశోర్‌రెడ్డి పేరుతో ఎకరం రూ.5.07 లక్షల చొప్పున 1.69 ఎకరాలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిసెంబర్, 2014కు ముందే కొనుగోలు చేసి మార్చి 30, 2016న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. నేలపాడులోనే మరో 0.84 ఎకరాలను తన కుమారుడి పేరుతో మే 5, 2016న పల్లె రఘునాథరెడ్డి రిజిస్ట్రేషన్‌ చేయించారు.