అంతా రామమయం : శ్రీరాముడి అంబారీసేవకు వేళాయే

  • Published By: madhu ,Published On : May 9, 2019 / 01:17 AM IST
అంతా రామమయం : శ్రీరాముడి అంబారీసేవకు వేళాయే

దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాద్రిలో రామయ్య అంబారీసేవకు వేళయ్యింది. 55ఏళ్ల తర్వాత మరోసారి శ్రీరామచంద్ర మహాప్రభువుకు అంబారీసేవ నిర్వహిస్తున్నారు. మే 09వ తేదీ బుధవారం సాయంత్రం సంప్రదాయబద్దంగా అంబారీసేవ కొనసాగనుంది. స్వామివారి అంబారీసేవను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా భద్రాద్రికి తరలివస్తున్నారు.  మరోవైపు ఏప్రిల్ 13న ప్రారంభమైన శ్రీరామక్రతువు మే 10వ తేదీ శుక్రవారంతో ముగియనుంది. 

శ్రీరామ విజయోత్సవవేళ…  భద్రాద్రి సీతారామచంద్ర స్వామి మహాప్రభువుకు గజరాజులతో  నిర్వహించనున్న శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. గజరాజయోజం అనేది అతిపెద్ద సన్మానం. వేదాలు తెలిసిన, ప్రజారంజక పాలన అందించిన శ్రీరామచంద్ర మహాప్రభువుకు ఏనుగు అంబారీపై ఊరేగిస్తుంటే చూడాలనేది అయోధ్య ప్రజల వాంఛ. దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలంలో గతంలోనే గజరాజ సేవలు రామునికి జరిగాయి. తిరిగి ఈ సేవలను భద్రాచలం ప్రజలతోపాటు భక్తులు మరోసారి కనులారా తిలకించే మహాభాగ్యం లభించనుంది. 

సుమారు ఐదున్నర దశాబ్దాల కిందట పెద్ద జీయర్‌స్వామి భద్రాచలంలో 27 రోజులపాటు శ్రీరామక్రతువును నిర్వహించారు. ఆ వేడుకలో భాగంగా గజరాజ సేవకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో మూడు చోట్ల రామకోటి స్థూపాలను ఏర్పాటు చేశారు. ఇవి ఆధ్యాత్మికులను కట్టి పడేస్తాయి. మరోసారి శ్రీరామక్రతువును అహోబిల రామానుజ జీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడి జీయర్‌మఠంలో కొనసాగుతోంది. చరిత్రలో నిలిచే  శ్రీరాముని అంబారిసేవను కనులారా తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం చేరుకుంటున్నారు.
ప్రస్తుత శ్రీరామక్రతువుకు నిదర్శనంగా చిన జీయర్‌ స్వామి సూచనల ప్రకారం గజరాజులతో భద్రాద్రి వీధుల్లో అంబారిసేవను నిర్వహించనున్నారు.

అహోబిల రామానుజ జీయర్‌స్వామి..శ్రీరామనవమికి ముందు నుంచే.. ఇక్కడే ఉంటూ నిత్య హోమాలను నిర్వహిస్తున్నారు. జీయర్‌మఠం నిర్వాహకులు గట్టు వెంకటాచార్య, జనార్దన్‌ భట్టార్‌తోపాటు మిగిలిన సభ్యులు శ్రీరామ క్రతువును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేపట్టారు. చరిత్రలో నిలిచిపోయే ఉత్సవం కావడంతో ఆలయ ఈవో తాళ్లూరి రమేష్‌బాబతో పాటు వైదిక సిబ్బందితో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. స్వామివారు మే 09వ తేదీ గురువారం సాయంత్రం అంబారీసేవలో ఊరేగనున్న వీధులను పవిత్ర గోదావరి తీర్థంతో ప్రోక్షణ చేశారు.

మరోవైపు మే 5వ తేదీన ప్రారంభమైన భగవద్‌ రామానుజాచార్య తిరునక్షత్ర ఉత్సవాలు కూడా మే 09వ తేదీ గురువారంతో ముగియనున్నాయి. రామానుజ జయంతి సందర్భంగా తిరుమంజనం చేసి..  విశేష భోగ నివేదనగా మధుర పదార్థాన్ని సమర్పిస్తారు. రామానుజ జయంతి సందర్భంగా జీయర్‌మఠం నేతృత్వంలో ఉదయం నుంచి రాత్రి వరకు అంతా రామమయం అనిపించేలా కార్యక్రమాలను రూపొందించారు. శిక్షణ పొందిన రెండు గజరాజులను ఇక్కడకు తీసుకుని వచ్చి నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు తిరువీధి సేవ ఉంటుంది.

ఉత్తర ద్వారం వద్ద మొదలై శ్రీకృష్ణాలయం మీదుగా వెళ్లి డీఎస్పీ బంగ్లా నుంచి యూబీ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మసీదు కూడలి మీదుగా తాతగుడికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి రాజవీధి గుండా జీయర్‌ మఠం మీదుగా ఆలయ పడమర మెట్ల వరకు వెళ్తారు. భజన బృందాలు, కోలాటాలు, మేళ తాళాలు, కొమ్ము నృత్యాలు ఇలా వేలాది మంది ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే సమాయత్తమయ్యారు. శ్రీరామచంద్రస్వామి అంబారిసేవను కనులారా వీక్షించేందుకు తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు మండుతుండడంతో భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించనున్నారు.