ఇలాంటి రోడ్ షో ఎప్పుడూ చూడలేదు : ఒక్క ఛాన్స్ ఇస్తే “బంగారు బెంగాల్” నిర్మిస్తామన్న అమిత్ షా

ఇలాంటి రోడ్ షో ఎప్పుడూ చూడలేదు : ఒక్క ఛాన్స్ ఇస్తే “బంగారు బెంగాల్” నిర్మిస్తామన్న అమిత్ షా

will make ‘Sonar Bangla’ in 5 years వెస్ట్ బెంగాల్​ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లదేశీయుల చొరబాట్లు లేని రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నారని అమిత్​ షా తెలిపారు. ఆదివారం(డిసెంబర్-20,2020) బీర్భమ్​ జిల్లాలోని బోల్​పుర్​లో నిర్వహించిన భారీ రోడ్​ షోలో అమిత్ షా పాల్గొన్నారు. హనుమాన్ మందిర్ స్టేడియం రోడ్ నుంచి ప్రారంభమై రోడ్ షో బోల్​పుర్​ చౌరస్తా వరకు సాగింది. అమిత్​ షాతో పాటు బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​, కీలక నేతలు రోడ్​ షోలో పాల్గొన్నారు.

కాగా, అమిత్ షా రోడ్​ షోకు జనం భారీగా హాజరయ్యారు.’జై శ్రీరాం’,’నరేంద్ర మోదీ జిందాబాద్’​,’అమిత్​ షా జిందాబాద్’​ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ…నా జీవితంలో చాలా రోడ్​ షోలలో పాల్గొన్నా. కానీ ఇలాంటి రోడ్​ షోను ఎప్పుడూ చూడలేదు. ప్రధాని మోడీ పట్ల బెంగాల్​ ప్రజల నమ్మకం, ప్రేమను ఈ రోడ్​ షో తెలియచెబుతోంది. అలాగే.. మమతా దీదీ పట్ల బెంగాల్​ ప్రజల ఆగ్రహాన్ని సూచిస్తోంది.

బెంగాల్​ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది రాజకీయ నాయకుడి మార్పు మాత్రమే కాదు. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లాదేశీయుల చొరబాట్లు లేని బంగాల్​ను చూడాలనుకుంటున్నారు. ఇప్పటివరకూ కాంగ్రెస్‌, లెఫ్ట్‌, తృణమూల్‌ పాలన చూశారు. నరేంద్ర మోడీకి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి, అయిదేళ్లలో బంగారు బెంగాల్‌(సోనార్ బంగ్లా)ని నిర్మిస్తాం అని అమిత్ షా హామీ ఇచ్చారు.

ఇటీవల, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ లో పర్యటిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ పై జరిగిన దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించిన అమిత్ షా..టీఎంసీ కార్యకర్తలు నడ్డాపై దాడి చేసిన తీరును బీజేపీ ఖండించింది మరియు నేను చాలా వ్యక్తిగతంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వినిపించే హక్కు ఉండాలని బీజేపీ నమ్ముతోందన్నారు.

ఇలాంటి దాడులతో బీజేపీ ఆగిపోతుందనే తప్పుడు అభిప్రాయంలో ఉండకూడదని టీఎంసీ నాయకులందరికీ తాను చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మా బేస్ ని విస్తరించడానికి తాము కృషి చేస్తామన్నారు. బెంగాల్ లో రాజకీయ హింస తారాస్థాయిలో ఉందన్నారు. 300మందికి పైగా బీజేపీ కార్యకర్తలు చంపబడ్డారు. వారి మరణాలపై జరుగుతన్న దర్యాప్తుల్లో ఎలాంటి పురోగతి లేదని అమిత్ షా అన్నారు. కాగా,అంతకు ముందు విశ్వభారతి యూనివర్శిటీని అమిత్ షా సందర్శించారు. ఆ తర్వాత బెంగాలీ ఫోక్‌ సింగర్‌ నివాసంలో అమిత్‌ షా మధ్యాహ్న భోజనం చేశారు.

అయితే, మరో నాలుగైదు నెలల్లో జరుగనున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటన కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన విషయం విదితమే. మరోవైపు బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా పలువురు కీలకమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకుంటున్నారు.