వార్ కంటిన్యూ : ఆ శాఖల్లో నిధులపై ఏపీ సీఎస్ సమీక్ష

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 06:08 AM IST
వార్ కంటిన్యూ : ఆ శాఖల్లో నిధులపై ఏపీ సీఎస్ సమీక్ష

మీరు ఎన్ని విమర్శలైనా చేసుకోండి..నా పని చేసుకుంటూ వెళుతా అంటున్నారు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆయన రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది. సీఎస్ వరస సమీక్షలను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఆయన మాత్రం సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తున్న సమీక్షలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆయన సమీక్షలు ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. ఈ విమర్శలను సీఎస్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సీఎస్ మరో సమీక్షా సమావేశానికి రెడీ అయ్యారు. 14 శాఖల్లో జరిగిన కేటాయింపులు ఎంత ? ఎంత ఖర్చు పెట్టారు.. కాంట్రాక్టుల చెల్లింపుల విషయంపై ఆరా తీస్తున్నారు. ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులపై సమాచారం ఇవ్వాలంటూ ఆయా శాఖల సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 14 శాఖలపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదటగా అటవీ శాఖ, మార్కెటింగ్, మెడికల్ హెల్త్ శాఖలపై సమీక్షించడానికి సిద్ధమయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ సీఎస్‌ను మారుస్తూ కేంద్రం రాజేసిన అగ్గి.. రోజు రోజుకు రాజుకుంటోంది. రాష్ట్రంలో సీఎస్ ఓ వైపు.. ప్రభుత్వం మరోవైపు అన్నట్లు తయారైంది. సీఎం, సీఎస్‌లకు సమీక్ష అధికారాలెలా ఉన్నా.. ఈ సమస్యకు ఫుల్‌ స్టాప్‌ పడాలంటే.. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు ఆగాల్సిందేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.