ఏపీలో డబ్బే డబ్బు : 4 రోజుల్లో రూ.30 కోట్లు, 36వేల లీటర్ల లిక్కర్ పట్టివేత

  • Published By: madhu ,Published On : March 14, 2019 / 01:23 AM IST
ఏపీలో డబ్బే డబ్బు : 4 రోజుల్లో రూ.30 కోట్లు, 36వేల లీటర్ల లిక్కర్ పట్టివేత

జస్ట్ నాలుగు అంటే 4 రోజులు.. 30 కోట్ల డబ్బు, 36వేల లీటర్ల మద్యం, 13కేజీల బంగారం పట్టుబడింది. ఇదంతా ఎన్నికల తనీఖీల్లో పట్టుబడింది. ఏపీ పాలిటిక్స్ లో డబ్బు ప్రవాహం ఏ స్థాయిలో ఉండనుందో.. ఈ అంకెలు చెబుతున్నాయి. నామినేషన్లు వేయకముందే.. అధికారిక ప్రచారం ప్రారంభం కాకముందే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో వందల కోట్లకు ఈ లెక్కలు చేరనున్నాయి. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బంగారం, ఇతర బహుమతులు సిద్ధం చేసుకుంటున్నారు.

కడప, విశాఖ జిల్లాలో భారీగా చీరలు, నగదు పట్టుబడ్డాయి. ఓటర్లను ప్రలోభపెట్టే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరసలో ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ అభిప్రాయపడింది. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగానే ఎన్నికల ప్రచారం ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోకుండానే నగదు భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాలుగు రోజుల్లో 30 కోట్ల నగదు, 13.57 కిలోల బంగారం, 31.5 కిలోల వెండి, 70 వాహనాలు, కోటి 31 లక్షల విలువైన మద్యం లభ్యమైంది. అంతేకాదు.. 165 స్పోర్ట్స్‌ కిట్స్‌, 588 సైకిళ్లు , మరెన్నో విలువైన బహుమతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు 16 లక్షల విలువైన 5వేల 400 చీరలు చెన్నై నుంచి గుంతకల్‌కు తరలిస్తుండగా కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారి పల్లె దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 18 లక్షల 50వేల నగదు పట్టుబడింది. ఇప్పటికే డబ్బు, బహుమతులు, గోల్డ్‌, వెండి ఇతరత్రా బహుమతులు ఇప్పటికే చేరాల్సిన చోటుకు చేరుకున్నాయి.

ఏపీలో రాజకీయ పార్టీల అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 6600 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 6160 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. 31 అంతరాష్ట్ర చెక్‌పోస్టులు, 46 తాత్కాలిక చెక్‌ పోస్టులు, 18 మొబైల్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టారు. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 161 బృందాలతో లావాదేవీలపై నిఘా పెంచారు. మూడు రోజుల్లోనే భారీగా నగదు, బంగారం, వాహనాలు, చీరలు, మద్యం, బహుమతులను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తేనే ఈ ఎన్నికలు ఎంత ఖరీదైనవో అర్థమవుతోంది. రాబోయే కాలంలో ఓటర్లను ప్రలోభపెట్టే ధన, కనక, వస్తు, వాహనాలపై పోలీసులు దృష్టి సారించారు.