ఓటెత్తారు : ఏపీలో 79.64 శాతం పోలింగ్

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 03:05 AM IST
ఓటెత్తారు : ఏపీలో 79.64 శాతం పోలింగ్

అమరావతి : గురువారం (ఏప్రిల్ 11, 2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో 79.64 పోలింగ్ శాతం నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగింది. 2014 ఎన్నికల్లో 78.41 శాతం మేరకు ఓటింగ్‌ నమోదైంది. ఈసారి 79.64 శాతం ఓట్లు పడ్డాయి. 2014 ఎన్నికల్లో 3.67 కోట్ల మంది ఓటర్లకుగాను 2.87 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో 3.93 కోట్ల మంది ఓటర్లకుగాను 3.13 కోట్ల మంది ఓటేశారు. 2014 ఎన్నికల కంటే ఈసారి 26 లక్షల మంది అధికంగా ఓటేశారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 85.98 శాతం మేరకు ఓటింగ్‌ నమోదవగా, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 71.81 శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకి 89.82 శాతంతో  అత్యధిక ఓటింగ్‌ జరిగిన నియోజకవర్గంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట 89.64 శాతం, ప్రకాశం జిల్లా దర్శి 89.62 శాతం ఓట్ల పోలింగ్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో పోలైన ఓట్లలోనూ పురుషుల కంటే 2,35,398 మంది మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. పోలైన ఓట్లలో 50.37 శాతం ఓట్లు మహిళలవి కాగా…49.63 శాతం ఓట్లు పురుషులవి.

సార్వత్రిక ఎన్నికల సంగ్రామం తొలి దశ పోలింగ్‌లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఏపీలో ఓటెత్తారు. ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి ప్లస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఈసారి విజయం మాదే అని టీడీపీ, వైసీపీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాయి. అంతిమంగా ఓటరు దేవుడు ఎవరిని కరుణాంచాడన్నది మే 23వ తేదీన తెలుస్తుంది.