ఎలక్ట్రానిక్స్ హబ్ @ ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ రంగానికి ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది.

  • Published By: chvmurthy ,Published On : March 27, 2019 / 02:29 PM IST
ఎలక్ట్రానిక్స్ హబ్ @ ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ రంగానికి ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది.

ఎలక్ట్రానిక్ రంగానికి ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది. తిరుపతి శ్రీ సిటీని సిలికాన్‌ కారిడార్‌గా తీర్చి దిద్దిన ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలిగింది. యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పించింది. ఈఎన్నికల్లో ఇది తమకు ఓట్లు పడేలా చేస్తుందని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. వివరాల్లోకి వెళితే…. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర విభజన తరువాత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఈ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించింది. 2019 నాటికి 8వేల 750కోట్ల  రూపాయల పెట్టుబడులు తీసుకురాగలిగింది. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో క్లస్టర్లన్నింటినీ కలిపి సిలికాన్ కారిడార్‌గా తీర్చిదిద్దింది. విభజనతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ పోటీ ధోరణితో పనిచేసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు ధీటుగా ఎలక్ట్రానిక్ రంగాన్ని అభివృద్ధి చేసింది. ఎలక్ట్రానిక్స్ పాలసీ ద్వారా 2020 నాటికి 40వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 4లక్షల ఉద్యోగాల కల్పించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. 
Read Also : అంబానీ ఫ్యామిలీనా మ‌జాకా : కోడ‌లికి ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చిన అత్త‌

ఏపీలో 20 ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో 376 చిన్నా, పెద్ద కంపెనీలు 25వేల 416కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా మొబైల్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ప్రతి నెల 30 నుంచి 35లక్షల మొబైల్‌ ఫోన్లు శ్రీసిటీలో తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి ఐదుగురు వాడుతున్న మొబైల్ ఫోన్లలో ఒకటి ఏపీలో తయారైన ఫోనే. ఫోక్సాన్, గ్జియామీ, జియోనీ, వన్ ప్లస్, లుమీనా, ఆసుస్, ఇన్ ఫోకస్ వంటి మొబైల్ కంపెనీలు 13వేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాయి.

స్థానికంగా అతిపెద్ద మొబైల్ తయారీ కంపెనీగా ఉన్న సెల్‌కాన్ ప్రతి నెల పదిలక్షల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్స్ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ వాషింగ్ మెషిన్లు, ఎల్ఈడీ టీవీలు, ఎల్‌ఈడీ ప్రాడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. డిక్సాన్ టెక్నాలజీ కంపెనీ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా.. రిలయన్స్, ఓల్టాస్, టీసీఎల్ కంపెనీలు ఉత్పాదక కార్యకలాపాలు చేపట్టబోతున్నాయి. పీఎస్‌ఏ, సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్, ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

ఎలక్ట్రానిక్స్ హబ్‌లు రెండింటిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖలో ఒక మెగా ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు చేస్తోంది. దీనికి తోడు కేంద్రం ప్రకటించిన ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్క్‌ను కాకినాడలో ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణాజిల్లాల్లో బ్రౌన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ తో పాటు.. విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ బజార్లను ఏర్పాటు చేయనుంది. ఏపీ ప్రభుత్వ చర్యలతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్ రంగంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలవనుంది.

అటు ఎలక్ట్రానిక్స్‌ రంగంలోనే కాకుండా ఐటీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కండ్యూయంట్, పై డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంప్లటన్, విప్రో టెక్నాలజీస్, మిరాకిల్ సాఫ్ట్ వేర్, హెచ్‌సీఎల్ కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా.. ఏపీ కేంద్రంగా సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు మరికొన్ని ఐటీ దిగ్గజాలు సిద్ధంగా ఉన్నాయి. 
Read Also : ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు : పవన్ కళ్యాణ్