అల్లుడి పెత్తనం – అత్తకు శాపం : చిత్తూరు టీడీపీలో హాట్ టాపిక్

10TV Telugu News

అల్లుడి పెత్తనం… అత్తకు శాపం..!
తిరుపతి టీడీపీలో అల్లుడి జోరు 
ఎమ్మెల్యే సుగుణమ్మకు ఈసారి టిక్కెట్‌ దక్కుతుందా..?
అల్లుడు సంజయ్‌ తీరు సుగుణమ్మకు శాపం కానుందా..?

తిరుపతి : టీడీపీలో అల్లుడి పెత్తనం…అత్తకు శాపంగా మారబోతోందా..? అల్లుడి వ్యవహారశైలి ఎమ్మెల్యే సుగణమ్మ టిక్కెట్‌పై ప్రభావం చూపనుందా..? కేడర్‌తో పాటు పార్టీ సీనియర్లు సంజయ్‌పై ఎందుకు గుర్రుగా ఉన్నారు..? ఇదే ఇప్పుడు తిరుపతి తెలుగుదేశంలో హాట్‌ టాపిక్‌గా మారి రాజకీయం వేడెక్కుతోంది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న సామెత తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు అతికినట్లు సరిపోతుందేమోననిపిస్తోంది. 2014 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణ అకాల మరణంతో..ఆయన సతీమణి సుగుణమ్మ అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. నాటి ఉప ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. పీజీ చదివిన సుగుణమ్మకు రాజకీయాలు కొత్తే. ఇంటిపట్టునే ఉన్న ఆమె అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఎమ్మెల్యేగా సుగుణమ్మ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ నాలుగేళ్ల కాలంలో వివాదాలకు దూరంగా ఉన్నారు. నిత్యం ప్రజలతో గడిపేందుకు యత్నించారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి తిరుపతిలో బలమైన క్యాడర్ ఉంది. ద్వితీయ శ్రేణి నాయకుల సంఖ్య కూడా ఎక్కువే. అవకాశం దొరికితే అంతా ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించేవారే. వెంకటరమణ మరణం… ఆయన భార్య సుగుణమ్మ ఎమ్మెల్యే కావడం… వంటి అనూహ్య పరిణామాలతో మిగతా నాయకులంతా ఆమెకు సహకరిస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఈ నాలుగేళ్లలో స్థానిక నాయకులు ఆమెను ముందుకు నడిపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై  పోటీ చేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. 

టికెట్ దక్కడంపై సందేహాలు : 
అంతాబాగానే ఉన్నా ఈసారి కూడా టికెట్ తనకే దక్కుతుందా, లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగతంగా సుగుణమ్మకు మంచి పేరే ఉన్నా.. వచ్చిన సమస్య అంతా  అల్లుడుతోనే. అల్లుడు సంజయ్ విషయంలో సుగుణమ్మ చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంకటరమణ ఎమ్మెల్యేగా కొనసాగినంత కాలం సైలెంట్‌గా ఉన్న అల్లుడు సంజయ్, తీరా అత్త ఎమ్మెల్యే అవ్వగానే ఒక్కసారిగా యాక్టివ్‌గా మారిపోయారు. సూపర్ ఎమ్మెల్యే‌గా వ్యవహరిస్తున్నారంటూ సంజయ్‌పై చాలా ఆరోపణలు ఉన్నాయి. కేవలం కొందరితోనే సఖ్యతగా ఉంటూ సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని పార్టీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. దీంతో ఎమ్మెల్యే అల్లుడు సంజయ్ వ్యవహారంలో తిరుపతి టిడిపి క్యాడర్ సైతం చాలా కాలంగా గుర్రుగా ఉంది. 

సుగుణమ్మకు భయం : 
సంజయ్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు నాయుడికి సైతం గతంలో అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఈ పరిణామాలతో సంజయ్ కాస్త వెనక్కు తగ్గినట్లు అనిపించినా.. ఈ విషయం తన టిక్కెట్‌పై ఎక్కడ ప్రభావం చూపిస్తుందోనన్న భయం సుగుణమ్మను వెంటాడుతోంది. సుగుణమ్మ మళ్లీ టీడీపీ తరపున బరిలో ఉంటే, అల్లుడు సంజయ్ వ్యవహారమే విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

సంజయ్‌ ప్రవర్తనపై సీనియర్లకెందుకు కోపం..?
సంజయ్‌ వ్యవహార శైలిపై కేడర్‌ గుర్రుగా ఉందా..?
అల్లుడి తీరు సుగణమ్మ టిక్కెట్‌పై ప్రభావం చూపనుందా..?