నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం

  • Published By: veegamteam ,Published On : October 18, 2019 / 03:18 AM IST
నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోంశాఖను కోరారు. దీనిపై కేంద్ర హోంశాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే.. గతంలో లాగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.

అంతకముందు ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీగా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణా రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రగా ఏర్పడిన తరువాత 30-10-2014న ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు అనగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా విడిపోయి జూన్ 2న తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏడింది. అందువలన అదే తేదిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అక్టోబరు 1, 1953న మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆంధ్రరాష్ట్రం తెలంగాణాతో కలిసి నవంబరు 1, 1956న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. జూన్ 2, 2014 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నవ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి.