పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: మార్చిలోగా ఎన్నికలు!

  • Published By: vamsi ,Published On : December 30, 2019 / 08:21 AM IST
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: మార్చిలోగా ఎన్నికలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసింది ప్రభుత్వం. చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు.

2011 జనగణన వివరాల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్‌ ఖరారుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వంద శాతం రిజర్వేషన్లు గిరిజనులున్న గ్రామ పంచాయితీను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 12 వేల715 గ్రామ పంచాయితీలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే పంచాయితీలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందిన 45 రోజుల్లోగా అంటే మార్చి 31లోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.