జగన్ సర్కార్ కు మరో షాక్ : పీపీఏలు రద్దు చేయొద్దు

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 02:47 PM IST
జగన్ సర్కార్ కు మరో షాక్ : పీపీఏలు రద్దు చేయొద్దు

జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) రద్దు చేయొద్దని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పబ్లిక్ హియరింగ్ లను చేపట్టవద్దని చెప్పింది. ధరల స్వీకరణ పిటిషన్ ఉపసంహరణను తప్పుబట్టింది. పాత ఒప్పందాలనే కొనసాగించాలని స్పష్టం చేసింది.

గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను సమీక్షించాలని వైపీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పలు సోలార్, విండ్ పవర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కడప, అనంతపురంకు చెందిన మూడు విద్యుత్ కంపెనీలు ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. గత ప్రభుత్వ పీపీఏలపై సమీక్ష చేయడంతో తమకు నష్టం వాటిల్లుతుందన్నారు. భవిష్యత్ లో అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

పీపీఏలపై సమీక్షించడమంటే తమపై నమ్మకం లేకపోవడమేనని ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాయి. ఈ విషయంపై 2 నెలలుగా కొనసాగిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పీపీఏలపై సమీక్ష, రద్దు అంశాలను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం చేపట్టదలచిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. అంతకముందు చేసుకున్న ఒప్పందాలను కొనసాగించాలని తేల్చి చెప్పింది.