నేడే ఏపీ కేబినేట్ భేటీ: విశాఖ అభివృద్ధికి వందల కోట్లు

  • Published By: vamsi ,Published On : December 27, 2019 / 01:17 AM IST
నేడే ఏపీ కేబినేట్ భేటీ: విశాఖ అభివృద్ధికి వందల కోట్లు

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను దాదాపుగా నిర్ణయించేసిన ఏపీ సర్కార్.. ఆ విషయానికి ఆమోద ముద్ర వేయడానికి ఇవాళ(2019 డిసెంబర్ 27) కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై ఈ కేబినేట్ భేటిలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే ముందుగానే మంత్రి బొత్స, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. విశాఖను రాజధానిగా చేయడం అనే ప్రకటన ఇక లాంఛనమే అనే విషయం స్పష్టం చేశారు.

అయితే జీఎన్ రావు ఇచ్చిన రిపోర్ట్‌లో ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయాలపై కేబినేట్‌లో మంత్రులు చర్చలు జరపనున్నారు. ఇప్పటికే విశాఖకు రాజధాని ప్రకటించిన సీఎం జగన్ ఆ స్థాయి అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులను కూడా విడుదల చేశారు. ఈ మేరకు అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు ఇవ్వడమే కాక, 390కోట్ల రూపాయల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు.

రేపు(28 డిసెంబర్ 2019) కాపులుప్పాడలో బయోమైనింగ్ ప్రాసెస్ ప్లాంట్‌కు రూ. 22.50 కోట్లు,కైలాసగిరి ప్లానిటోరియం కోసం రూ.37 కోట్లు , సిరిపురం జంక్షన్‌లో మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌, వాణిజ్య సముదాయం కోసం రూ. 80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రిసెర్చ్ సంస్థకు రూ.88 కోట్లు , చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణానికి రూ. 90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ. 40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణానికి రూ.75 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు మరికొన్ని పనులకు జగన్ శంకుస్థాపనలు చేస్తారు. ముందుగా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. 

ఈ ఏర్పాట్లను చూస్తుంటే.. ఇవాళ కేబినేట్‌లో ఏం నిర్ణయాలు తీసుకోబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.