ఏప్రిల్-1న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

ఏప్రిల్-1న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

తెలంగాణ కంటే గొప్పగా ఏపీని అభివృద్ధి చేయాలని సంకల్పం తీసుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మార్చి-25,2019) ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… తాను సంపద సృష్టించేది పేదవాళ్ల కోసమేనని తెలిపారు.ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ మళ్లీ ఇస్తామని సీఎం చెప్పారు. తాను రైతు బిడ్డనని..వాళ్ల కష్టాలు తనకు తెలుసన్నారు.  నాలుగు, ఐదు విడతల రుణమాఫీ డబ్బులు  ఏప్రిల్‌-1,2019న రైతుల ఖాతాల్లో పడుతుందని తెలిపారు.ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ మళ్లీ ఇస్తామని చెప్పారు. తాను రైతు బిడ్డనని.. వాళ్ల కష్టాలు తనకు తెలుసన్నారు. 

 రాష్ట్రంలోని ప్రధాన నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని చెప్పారు. కోటిమంది డ్వాక్రా మహిళలకు త్వరలో స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వనున్నామన్నారు. ప్రజలకు పైసా ఖర్చు లేకుండా మొత్తం వైద్యఖర్చులు భరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గర్భిణులు నచ్చిన ఆస్పత్రికి వెళ్లి కాన్పులు చేసుకోవచ్చని.. ఆ ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన పనులతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని..  ఐదేళ్లపాటు పనులు చేసి ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు మళ్లీ వచ్చానని చెప్పారు. దమ్ముంటే మోడీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగులు తీసి కలిసి పోటీ చేయాలని సీఎం సవాల్‌ విసిరారు.