ఆ ముగ్గురూ : వెయ్యి కోట్ల ప్యాకేజీ కుట్రలంటున్న చంద్రబాబు

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 04:58 AM IST
ఆ ముగ్గురూ : వెయ్యి కోట్ల ప్యాకేజీ కుట్రలంటున్న చంద్రబాబు

ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై పలువురు కుట్రలు పన్నుతున్నారంటూ గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న ఏపీ సీఎం బాబు విమర్శలకు మరింత పదును పెట్టారు. మోడీ, జగన్, కేసీఆర్‌లు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో కుట్రలను ప్రారంభించారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థ తీసుకరావాలన్నదే వీరి ఆలోచన అన్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ఉదయం బాబు టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లాల నేతలతో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్‌ను ధ్వేషించిన కేసీఆర్, కేటీఆర్‌లు జగన్‌పై ప్రేమ చూపుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో కుట్ర పన్నుతున్నారని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సమగ్రాభివృద్దే టీడీపీ లక్ష్యమని పేర్కొన్న బాబు మంచి కొరుకున్న వారే టీడీపీలో చేరుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అవినీతిని కాంక్షించే వారు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని విమర్శలు గుప్పించారు. 

ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం టెలీకాన్ఫరెన్స్‌తో వివిధ జిల్లాల నేతలతో మాట్లాడుతున్నారు. ఆయా జిల్లాలో నెలకొన్న పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సూచిస్తున్నారు. వివిధ సమావేశాల్లో పాల్గొంటున్న బాబు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.