మనసున్న మహిళను అభినందించిన డీజీపీ గౌతం సవాంగ్ 

  • Published By: chvmurthy ,Published On : April 18, 2020 / 02:03 PM IST
మనసున్న మహిళను అభినందించిన డీజీపీ గౌతం సవాంగ్ 

లాక్‌డౌన్‌ వేళ ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు రోజుల క్రితం కూల్‌డ్రింక్స్‌ అందించిన మహిళను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. వివరాళ్లోకి వెళితే.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులో గత కొన్ని వారాలుగా పోలీస్ చెక్ పోస్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారు. 

అయితే అటుగా వెళ్తున్న లోకమణి అనే మహిళ.. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు 2 కూల్ డ్రింక్ బాటిల్స్ అందించింది. ఎందుకు ఇస్తున్నారని అక్కడున్న ఇన్స్‌ప్టెక్టర్‌ ప్రశ్నించగా మీరు చేస్తున్న పనికి మా వంతు సహాయం సార్‌ అంటూ నవ్వింది. దీంతో ఊహించని అభిమానానికి ఆ పోలీసు అధికారి సంతోషంతో అమ్మ నీ నెల జీతం ఎంత. మాకు కూల్‌డ్రింక్‌లు ఇస్తున్నావు అని అన్నారు. 

దానికి మహిళ స్పందిస్తూ.. ఓ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నానని.. నెలకు 3500 రూపాయల వేతనం వస్తుందని చెప్పింది. దీంతో తక్కువ వేతనంతో జీవితం గడుపుతూ ఎంతో పెద్ద మనసుతో పోలీసులకు కూల్‌డ్రింక్‌ ఇస్తున్నారంటూ ఆమెను పోలీసులు అభినందించారు. అలాగే  రెండు కూల్‌డ్రింక్‌లు ఆమెకిచ్చి పిల్లలకు ఇవ్వమని పోలీసు అధికారులు సూచించారు. 

ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అందరూ లోకమణిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్తా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వీడియోకాల్ ద్వారా ఆమెను అభినందించారు. 

శనివారం ఆయన వీడియో కాల్ లో లోక మణి తో మాట్లాడుతూ.. ‘పోలీసులకు కూల్‌డ్రింక్స్‌ ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు చేసిన మంచి పనికి మేము దండం పెడుతున్నాం. మీ అమ్మతనం చూసి చలించిపోయాము. మీకు సెల్యూట్‌ చేస్తున్నాం. అని ప్రశంసించారు.