ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల తేది ఖరారు

  • Published By: vamsi ,Published On : May 16, 2019 / 01:49 AM IST
ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల తేది ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎంసెట్‌-2019) ఫలితాలు ఈనెల(మే) 18వ తేదీన విడుదల కానున్నాయి. విజయవాడలో శనివారం(18 మే 2018) మధ్యాహ్నం 12గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. విజయరాజు, ఏపీ ఎంసెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ సాయిబాబు వెల్లడించారు. ఫలితాలు విడుదల కాగానే అభ్యర్థుల సెల్‌ నంబర్లకు ర్యాంకుల వివరాలను ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపిస్తామని సాయిబాబు తెలిపారు.

ఎంసెట్ ఫలితాలను వాస్తవానికి మే 1వ తేదీనే విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే ఇంటర్ మార్కులు అందడం ఆలస్యం కావడంతో ఫలితాలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు తెలంగాణ, ఏపీ నుంచి ఇంటర్ మార్కులు అందడంతో ఎంసెట్ ర్యాంకులను కేటాయించినట్లు కన్వినర్ చెప్పారు. మే 17వ తేదీ వరకు ఈ ప్రక్రియ అంతా ముగుస్తుంది.

ఏపీ ఎంసెట్‌కు హాజరైన మొత్తం 2,82,901 మంది విద్యార్థుల్లో ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,95,908 మంది విద్యార్థులు హాజరవగా.. అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ) విభాగాలకు 86,993 మంది హాజరయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 20 వేలమంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. ఇతర వివరాలకు 08842340535, 2356255 నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్‌ సూచించారు.