చంద్ర వ్యూహం : టీడీపీ తొలి జాబితాపై టెన్షన్

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 01:23 AM IST
చంద్ర వ్యూహం : టీడీపీ తొలి జాబితాపై టెన్షన్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల టెన్షన్‌ మొదలైంది.. టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా ప్రకటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా చెప్పినట్టు సంక్రాంతి పండుగకు ఫస్ట్ లిస్ట్ విడుదల అవుతుందా..? లేదా అనే సందిగ్దంలో పార్టీ నాయకులున్నారు.  అధినేత మరింత లోతుగా కసరత్తు చేసి తుది జాబితా ఖరారు చేస్తారా? లేక కావాలనే ఆలస్యం చేస్తున్నారా? ఏపీ అసెంబ్లీ తొలి జాబితా విడుదల చేసి తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు.. ఆ దిశగా కసరత్తు కూడా మొదలెట్టేశారు. కానీ ఎవరికి ఛాన్స్ వస్తుందనేది ఉత్కంఠగా మారింది. సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించినా అది నెరవేరదని తెలుస్తోంది. దీంతో తెలుగు తమ్ముళ్లు టెన్షన్‌ పడుతున్నారు. ఆఖరి నిమిషంలో కాకుండా టికెట్లు ఇవ్వకుండా ముందుగానే  కేటాయిస్తే  ప్రచారపర్వంలోకి దిగుతామని ఆశావాహులు అభిప్రాయపడుతున్నారు..
ఈ నెలాఖరులో చంద్రబాబు దావోస్‌ పర్యటన
అమరావతిలో ధర్మపోరాట సభ

జన్మభూమి కార్యక్రమం ఉండడం…పార్టీ కార్యక్రమాలు…దావోస్ పర్యటన ఉండడంతో తొలి జాబితా విడుదల చేసేందుకు ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. మరోవైపు పార్టీ చేపట్టిన ధర్మపోరాట దీక్ష సభను ఫిబ్రవరి నెలలో అమరావతిలో నిర్వహించనున్నారు..జాతీయ స్థాయినేతలను సభకు ఆహ్వానించి తమ సత్తా చాటడానికి కసరత్తు చేస్తున్నారు. దీంతో వచ్చే నెలలో కూడా అభ్యర్దుల తొలి జాబితా వెలువడడం కష్టమే అని తెలుస్తోంది..
వ్యూహాత్మకంగానే అభ్యర్ధుల జాబితా ప్రకటన ఆలస్యం
90 నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక పూర్తి
ప్రత్యర్ధి పార్టీలపై కన్నేసిన చంద్రబాబు
రాజకీయ కార్యక్రమాలు, అభ్యర్ధులు, కులాల సమీకరణ

జాబితా ఆలస్యం వెనుక ప్రధానమైన కారణం వేరే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై కన్నేసిన బాబు…వారి అభ్యర్థులు ఎవరు ? కులాల సమీకరణ ఏ విధంగా చేస్తారు ? తదితర అంశాలను బేరీజు వేసుకుని ముందే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని బాబు యోచిస్తున్నట్లు టాక్. అంతేకుండా సీటు దక్కని వారు ఇతర పార్టీల్లోకి జంప్ అయితే..టీడీపీకి తలనొప్పులుగా మారుతాయని అనుకుంటున్నారట. 
పార్టీలోని అంతర్గత సమాచారాన్ని బట్టి ఇప్పటికీ 90 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి  అయ్యింది. ఏదిఏమైనా ముందు అనుకున్నట్లుగా టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.